4, ఫిబ్రవరి 2013, సోమవారం

స్వర్గధామం



”మరి ఎవరయితే తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనసుని దుష్ట వాంఛలకు దూరంగా ఉంచాడో అతని నివాసం స్వర్గం అవుతుంది. అతను దానిలో సదా ఉంటాడు”.(నాజిఆత్‌: 40,41)
”నిజం – ఎవరయితే నరకాగ్ని నుండి కాపాడ బడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే అసలు సిసలయిన విజేతలు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 185)
కాలం నిర్విఘ్నంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. ప్రతి వ్యక్తి జీవన యాత్ర చేస్తూ గమ్యం వైపునకు సాగిపోతున్నాడు.  ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకుని, దాన్ని ఛేదించే దిశలో దూసుకుపోతు న్నారు. కాని ఈ లక్ష్య సాధనలో అందరూ సఫలీకృతులు కాలేరు. ఎందరో అలసిసొలసి విఫలురై పోతారు. అయితే అల్లాహ్  ప్రీతిని పొందే ఉద్దేశ్యంతో ముందుకు సాగే వ్యక్తి శ్రమ ఎన్నటికీ వృధా కాదు. అలాంటి వ్యక్తి నోట సదా ఈ వేడుకోలు వచనం జాలువారుతూ ఉంటుంది - ”ఓ మా ప్రభూ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసా దించు. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు”. (బఖరా: 201)
అతని కోసం సృష్టిలోని సకల జీవరాసులు దుఆ చేస్తాయి. ఈ దుఆలు మరియు జనుల, దైవ దూతల దీవెనలు స్వర్గ రూపంలో ప్రతిఫలిస్తాయి. ఇంతకీ ఎవడా అదృష్టవంతుడు? ఈ మహా భాగ్యం ఎవరి ఖాతాలో చేరుతుంది? అతడు – పడుకునేటప్పుడు వుజూ చేెసుకొని నిద్రపోయాడు. ’అస్స లాతు ఖైరుమ్మినన్‌నౌమ్‌ – నిద్రకన్నా నమాజు మేలయినది’ అన్న ముఅజ్జిన్‌ పిలుపు చెవిలో పడగానే సుఖ నిద్రను పరిత్యజించి లేచి వుజూ చేసుకున్నాడు. నమాజు కోసం బయలుదేరాడు. భక్తీప్రపత్తులతో నమాజు చేశాడు. అల్లాహ్‌ాను ఎంతో తాదాత్మ్యంతో స్మరించాడు. ఆ భక్తిపరుడు ఎన్నో పనులతో తలమునకలయి ఉన్నాడు. కానీ, ‘హయ్యా అలస్సలాహ్‌ా -నమాజు వైపునకు రండి!  అన్న పిలుపు వినబడింది. అల్లాహ్‌ా విధిని నిర్వర్తించడానికి సకల పనులను ప్రక్కన పెద్ద మస్జిద్‌ వైపు నడవనారం భించాడు.
శుక్రవారం నాడు తన షాపు ముందు చాలా మంది కష్టమర్లున్నారు. వ్యాపారం మంచి ఊపు మీద ఉంది. అంతలోనే ’హయ్యా అలల్‌ ఫలాహ్  - సాఫల్యం వైపునకు రండి!’ అన్న నినాదం కర్ణపుటాలకు తాకింది. తక్షణమే అతనికి అల్లాహ్‌ా చేసిన హితువు గుర్తుకొచ్చింది- ”ఓ విశ్వసించినవారలారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచిన ప్పుడు అల్లాహ్  సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయావిక్రయా లను వదిలి పెట్టండి…నిజంగా వినోదక్రీడలకంటే, వ్యాపారంకంటే అల్లాహ్‌ా వద్ద ఉన్నదే శ్రేష్ఠమయినది. అల్లాహ్  అందరికంటే మేలయిన ఉపాధప్రదాత”. (జుమా: 9) అంతే, షాపు మూసేసి మస్జిద్‌ వైపు జుమా నమాజు కోసం సాగిపోయాడు. ఆ సత్యప్రియుడు గదిలో కొందరు స్నేహితులతో కూర్చొని ఉన్నాడు. ఏదో విషయమయి గొప్ప చర్చే జరుగుతోంది. ఉన్నట్లుండి వ్యర్థ ప్రలాపనలు, అశ్లీల పరాచికాలు మొదలయ్యాయి. అంతే. అతను వెంటనే దైవాగ్రహానికి కారణభూతమయ్యే ఆ స్థలానికి, అట్టి స్నేహానికి స్వస్తి పలికాడు. ఆ సద్వర్తనుడు చాడీలు చెప్పి, తమ సాటి సోదరుని మృత కళేబరాన్ని భక్షించే వారి సమావేశాల్లోకి వెళ్లడుగాక వెళ్లడు. ఒకరి వీపు వెనకాల మాట్లాడటం, ఎదుటివారిలో చిచ్చు పెట్టి వేెడుక చూడ టం అతని బొత్తిగా నచ్చదు. ఆ పుణ్యాత్ముడు పలికితే సత్యమే పలుకు తాడు. దైవాదేశాలకు, దైవప్రవక్త (స) నియమావళికి లోబడి జీవిస్తాడు. రమజాను ఉపవాసాలుంటాడు. జకాత్‌ను విధిగా చెల్లిస్తాడు. విరివిరిగా దానధర్మాలు చేస్తాడు. అనాథలకు ఆశ్రయం ఇస్తాడు. నిరు పేదలు, వితంతువులు, వికలాంగుల బాగోగులను గమనిస్తాడు. ఇరుగు పొరుగు వారి శ్రేయాన్ని కోరుతాడు, తల్లిదండ్రులను సేవిస్తాడు. పగవారితో సయితం ప్రేమగా వ్యవహరిస్తాడు. సంతానానికి సరైన సంస్కారాన్ని నేర్పుతాడు. భార్యతో ఉదారంగా వ్యవహరిస్తాడు. చిన్న చీమ మొదలు స్వర చేప వరకూ ప్రతి జీవి క్షేమాన్ని మనసారా కాంక్షిస్తాడు. అందరి లాగే అతనికీ మరణం సంభవించింది.
దైవ సన్నిధి -   ఆ దాసుడు అల్లాహ్  ముందు నిలబడి ఉన్నాడు. అల్లాహ్  అతన్నుద్దే శించి: ’ఓ నా దాసుడా! నీ వల్ల జరిగిన ఫలానా పాపాన్ని గుర్తుచేసుకో’ అంటాడు. దాసుడు గుర్తు చేసుకుమటాడు. ’ఓ నా ప్రభూ!నేను సర్వ నాశనమయి పోయాను’ అని మొరపెట్టుకూమటాడు. దానికి అల్లాహ్ : ’నువ్వు ఈ పాపంపై పశ్చాత్తాపం చెందావు గనక ప్రపంచ జీవితంలో నీ ఈ పాపాన్ని పరుల నుండి కప్పిపుచ్చాను. నువ్వు నన్నే నుమ్ముకున్నావు గనక ఈ రోజు నిన్ను క్షమిస్తున్నాను’ అంటాడు. ఇక ఆ దాసుని ఆనం దానికి మేరే ఉండదు.
మిత్రులరా! మనలో పాపం చేయని వారు ఎవరు? అయితే పాపం చేసి పశ్చాత్తాపం చెందిన వారే ధన్యులు. నిజ దైవ దాసుల లక్షణం కూడా అదే - ”వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరి ని అవలంబిస్తారు. అలాంటి సదాచార సంపన్నులనే అల్లాహ్  ప్రేమిస్తాడు. మరియు వారు తమ ద్వారా ఏదయినా నీతిబాహ్య మయిన పని జరిగి పోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదయినా అన్యాయం చేెసుకుంటే వెంటనే అల్లాహ్‌ాను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్‌ా తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు? - వారు తమ వల్ల జరి గింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు”.(ఆలి ఇమ్రాన్‌: 134-135) ”వారికే తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభిస్తుంది…ఈసత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!”. (ఆలి ఇమ్రాన్‌: 136)
దాసుడి లెక్కల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడింది. వెంటనే తన వారి వైపునకు పరుగులు తీశాడు. ఈ రోజు అతని ఆనందానికి అవ ధులు లేవు. సంతోషంతో అతని ముఖం అరవిందంలా విప్పారింది. తన ప్రగతి పత్రాన్ని అందరి ముందూ ప్రదర్శిస్తూ - ’ఇదిగో,చూడండి! నా కర్మల పత్రాన్ని. మీరు చదవండి….నా కర్మలకుగాను మంచి ప్రతి ఫలం లభిస్తుందని నేను అనుకుంటూ ఉండేవాడను. ఓ మహ్షర్‌ మైదా నంలో ప్రోగయి ఉన్న ప్రజలారా! చూడండి! నా కర్మల పత్రం నా కుడి చేతిలో ఇవ్వబడింది. ఏం చూస్తున్నారు? ఇది నమాజు! ఇది అన్న దానం! అదేమో ఉపవాసాలు! అవేమో హజ్జ్‌ ఉమ్రాలు, దుఆ,జిహాద్‌లు – ఇవన్నీ పుణ్యాలే. మీకు కానరావడం లేదా? నిశ్చయంగా నా ఈ కర్మల పత్రంలో పశ్చాత్తాపం – తౌబా ఉంది, క్షమాభిక్ష – ఇస్తిగ్ఫార్‌ ఉంది. దేవుని స్తుతిస్తోత్రాలు, పవిత్రతా కీర్తనలు – తస్బీహ్ , తహ్మీద్‌, తహ్లీల్‌ కూడాఉన్నాయి. అల్లాహ్  వైపుకు ఆయన దాసుల్ని సాదరంగా ఆహ్వానించడం, ధర్మాన్ని, ఖుర్‌ఆన్‌ని నేర్చుకొని ఇతరులకు నేర్పించడ మూ ఉంది.  బాగా చూడండి! ఇది ఫజ్ర్‌, జుహ్ర్  , అస్ర్‌, మగ్రిబ్‌, ఇషా నమాజు. అదేమో తహజ్జుద్‌, ఇష్రాఖ్‌, ఇస్తిఖారా, ఇస్తిస్ఖా, తసీబీహ్‌ా నమాజు. నేను మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి వచనాన్ని ఇహ లోకంలోనే గ్రహించాను ’ఖుర్‌ఆన్‌ను నేెర్చుకొని ఇతరులకు నేర్పేవాడు మీలో ఉత్తముడు’ అని. (బుఖారీ)
‘మరెవరయితే తమ ఫ్రభువుకు భయపడేవారో వారిని బృం దాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవడం జరుగు తుంది”.(జుమర్‌:73) ఈ సౌభాగ్యవంతులు స్వర్గం వైపునకు తీసుకు పోబడతారు. అక్కడికెళ్ళి అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమయింది? ఈ ఎదురు చూపులు ఎవరి కోసం? అవునవును….వారు తమ ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) కోసం వేచి ఉన్నారు. మనుషుల్లో మహామనీషి! ప్రవక్తలందరిలో అగ్రజులు!! విశ్వ కారుణ్యమూర్తి! మానవ మహో పకారి!! దివ్యతేజస్సుతో కాంతులీనుతూ దేదీప్యమానమయిన ముఖార విందంతో ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు అందరూ మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)తో కలిసి స్వర్గం తలుపుల దిశగా అడుగులు వేస్తారు.
స్వర్గం – స్వర్గానికి ఎనిమిది ద్వారాలు. స్వర్గాన్ని స్వయంగా అల్లాహ్‌ా, ప్రియమైన దాసుల కోసం తన స్వహస్తాలతో అలంకరించాడు. స్వర్గం లో ఒక బాణం పెట్టుకునేంత చోటు లభించినా అది ప్రాపంచిక సకల సంపదలకంటే ఎంతో ఘనతరమయినది. అందులో మొదట ప్రవేశించే అదృష్ట సముదాయం మహా ప్రవక్త ముమహమ్మద్‌ (స) వారి సముద యం. ఇదిగో! మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) అడుగు ముందుకు వేశారు. స్వర్గం తలుపు తడుతున్నారు. ’ఎవరు మీరు?’  స్వర్గదూతలు ప్రశ్నిం చారు. ”నేను…ముహమ్మద్‌ని (స)”.’ఓ ప్రవక్తా! మీ గురించి మాకు ఆజ్ఞాపించబడింది’.'ఏమని?’ ’మీరు వచ్చే వరకూ స్వర్గ ద్వారాలు తెరవకూడదని’. అల్లాహు అక్బర్‌! స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి. ”వారు అక్కడకు చేరుకునేటప్పడికే దాని ద్వారాలు తెరవబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారి నుద్దేశించి, ‘మీపై శాంతి కురియుగాక! – సలామున్‌ అలై కుమ్‌’. మీరు హాయిగా ఉండండి” అని (సాదరంగా స్వాగతిస్తారు) అంటారు. (జుమర్‌: 73)
 అది ఎలాంటి సన్నివేశం?! అందరి ముఖాలు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాయి. వారు అనందాతిశయంతో అల్లాహ్‌ా ఘనకీర్తిని చాటుతు న్నారు. స్వర్గ నిర్వహణాధికారులు వారితో - ’మీరు భాగ్యవంతుల య్యారు. మీరు ఇహలోకంలో మంచిగా మసలుకున్నారు. అం దుకే స్వర్గంలో ని సకల భోగబాగ్యాలను అనుభవించేందుకు అందులో ప్రవేశించండి. ”అక్కడ దయాసాగరుడయిన అల్లాహ్  తరఫు నుండి వీరికి ’సలామ్‌’ చెప్పబడుతుంది’. (యాసీన్‌:58) ఎంత అదృష్టం! మరెంత భాగ్యం!!
స్వర్గద్వారాల వద్ద నిలబడి దైవదూతలు పిలుపునిస్తున్నారు: ’క్రమం తప్పకుండా నమాజు చేసినవారలారా! రండి, ‘బాబుస్సలాత్‌ – నమాజు ద్వారం’ గుండా స్వర్గంలో ప్రవేశించండి. నిష్ఠగా ఉపవాసం పాటించే వారలారా! మీ కోసం బాబుర్రయ్యాన్‌ సిద్ధంగా ఉంది. నిజాయితీగా జకాతు చెల్లించే వారలారా! మీరు బాబుజ్జకాత్‌ ద్వారా స్వర్గంలో ప్రవే శించండి. పుణ్యఫలాపేక్షతో దానధర్మాలు చేసినవారలారా! మీ కోసం బాబుస్సదఖా ఉంది. ప్రాణాలొడ్డి దైవ మార్గంలో పోరాడిన ఓ జిహాద్‌ యోధులారా! దేవుడ స్వయంగా ఈ బాబుల్‌ జిహాద్‌ను తయారుచేశాడు రండి. కొందరు భాగ్యవంతుల్ని రెండేసి ద్వారాల గుండా పిలుపునివ్వ డం జరుగుతుంది. మరికొంత మంది అదృష్టవంతుల్ని మూడు ద్వారాల గుండా, ఇంకొందరిని నాలుగు ద్వారాల గుండా పిలవడం జరుగు తుంది. వారిలో మరీ అదృష్టవంతులుంటారు. వారిని స్వర్గపు అన్నీ ద్వారాల గుండా స్వాగతించడం జరుగుతుంది. అల్లాహ్‌ాను తన ప్రభు వుగా, ముహమ్మద్‌ (స)ను తన ప్రవక్తగా నమ్మి, అయిదు పూటల నమాజు చేసి, రమజాను ఉపవాసాలు ఉండి, జకాత్‌ చెల్లించి, హజ్జ్‌ చేసి, తన భర్తతో మంచిగా నడుచుకున్న మహిళామూర్తులు కూడా ఈ జాబితాలో చేరతారు అని మహా ప్రవక్త ముహ్మద్‌ (స) వారే స్వయంగా సెలవిచ్చారు. వారికి నచ్చిన ద్వారం గుండా వారు స్వర్గంలో ప్రవేశించ వచ్చు. సుబ్హానల్లాహ్!
సోదరా, సోదరీ! స్వర్గపు ఒక్కో ద్వారం వెడల్పు ఎంత ఉంటుందనుకుం టున్నావు? నలభై సంవత్సరాలు ఆగకుండా నడిచినా తరగనిదంత! ఇక్కడో విచిత్రం ఉంది. అదేమిటంటే – ఆ రోజు ఆ ద్వారాలే స్వర్గ వాసులతో కిటకిటలాడుతుంటాయి. అల్లాహు అక్బర్‌! ! సోదరా, సోదరీ! ఆలోచించు! నీవు స్వర్గవాసివన్న శుభవార్త ఇవ్వబ డింది. దైవకృపతో నువ్వు పుల్‌సిరాత్‌ను దాటుకొని ఖన్తర అనే ప్రదేశానికి చేరుకున్నావు. నీలోని కల్మషాన్ని, కల్లాకపటాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆనక నువ్వు స్వర్గపు తలుపుల దగ్గరకు వచ్చావు. ’బిస్మిల్లాహ్‌ా’ అంటూ నీ కుడి పాదాన్ని  స్వర్గంలో మోపావు. ఏం కనబడుతోంది? అక్కడ నువ్వు ఎటు చూసినా దైవానుగ్రహాలే. ’ఒక మహత్త సామ్రాజ్య వైభవం అక్కడ నీకు కనబడుతుంది’.ఒకేఒక్క అడుగు – దాసుడు ప్రపంచపు సకల బాదలను, దుఃఖాలను మరచిపో తాడు. అసలు ఇహలోకమన్నదే అతనికి జ్ఞప్తికి రాదు. నమాజు అలసట ఎటెళ్ళింది? జిహాద్‌ అలసట ఎటు మాయమయింది? భార్యాబిడ్డల, తల్లిదండ్రుల కోసం ధర్మసమ్మతమయిన సంపాదన కావాలని పడిన శ్రమంతా ఏమయింది? అన్నీ పోయాయి..మిగిలిందొకటే…అది అతని అదృష్టం! ఒక్క పాదమే కదా మోపింది! ఇంతలోనే అంత మహిమ.మరి ఇప్పుడతను రెండో పాదం మోపుతున్నాడు. ఎలా ఉంది స్వర్గం?……..-


స్వర్గధామం – అది సుఖసంతోషాలకు, భోగభాగ్యలకు, అపార వరానుగ్రహాలకు శాశ్వత స్థావరం. శ్రమ, అలసట, బాధ, దుఃఖం, ఆందోళనలు మచ్చుకయినా ఉండని శాంతి నిలయం. అసూయ, అసంతృప్తి, విరోధం, విద్వేషాలకు ఏమాత్రం తావు లేని ఏక హృదయ కోశం. కోరిన వరం తక్షణం లభించే ఆనంద నిలయం. అనుక్షణం ఆనంద డోలికల్లో ఉర్రూతలూగించే నిత్య హరిత వనం. ఆత్మ, అంతరంగం, దేహం, చైతన్యాలలోని అణువణు వును పులకింపజేస్తూ దైవదర్శనా భాగ్యం కలిగించే ముక్తిప్రదాయని. మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుడిగా మార్చే ఖుర్‌ఆన్‌ లో ఇలా సెలవియ్యబడింది: ”వారు చేసుకున్న సత్కర్మలకు ప్రతిఫలంగా వారి కళ్లను చల్లబర్చే అఫూర్వ సామగ్రి వారి కోసం దాచబడి ఉంది. దాన్ని గురించి ఏ మనిషికీ తెలియదు. (అది ఊహాతీతమయినా అద్భుత మహా భాగ్యం)”. (దివ్యఖుర్‌ఆన్‌: 32: 17)

ఇహలోకంలోని యావత్తు సంపదతో పోల్చితే స్వర్గంలో ఏ ఒక్క వస్తువుకు కూడా మనం విలువ కట్టలేము. ’స్వర్గంలో ఒక కమ్చీ (చర్నంక్రోలు) ఆక్రమించుకునేంతటి (చాలా కొద్దిపాటి) స్థలం యావత్తు ప్రపంచం, ప్రపం చంలోని సమస్త వస్తువులకంటే  ఎంతో శ్రేష్ఠ మయినది’ (ముస్లిం) అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స).
యుగాలు మారిన, జగాలు మారినా, సూర్యా చంద్రాలున్నంత వరకూ మానవుని మాధవుని తో కలిపే, మానవాళి ఆచరించి తరించాల్సిన మహోపదేశం అయిన హదీసె ఖుద్సీలో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”నేను సజ్జనుల యిన నా దాసుల కోసం స్వర్గంలో ఎలాంటి అపురూప వస్తు సంపదను తయారు చేెసి పెట్టానంటే,  వాటిని ఇంత వరకు ఎవరి కళ్ళు కనలేదు. ఎవరి చెవులూ వినకలేదు.  చివరి మానవుని మనస్సు సయితం వాటిని గురించి ఊహించలేదు”. (ముత్తఫఖున్‌ అలైహి) ”స్వర్గంలో విశ్వాసి కొరకు ఒక ముత్యగుడారు (ఖైమా) ఉంటుంది. ఆ కుటీరం మొత్తం ఒకే ఒక్క ముత్యంతో తయారు చేయబడి ఉంటుం ది. అది అరవై మైళ్ళ పొడుగు ఉంటుంది”. (ముత్తఫఖున్‌ అలైహి)

సజ్జనుడయిన ఆ దైవ దాసుడు ఇప్పుడు రెండో కాలు కూడా మోపాడు. ఏమిటి? స్వర్గ నేల తెల్లగా ఉందే అని ఖంగు తిన్నాడు.  చూపులు  పైకెళ్ళాయి సూర్యుడు కన్పించలేదేమిటా అని ఉలిక్కిపడ్డాడు. ప్రజలని నేనెలా చూడగలను? నా స్నేహితులని, ఆప్తులని ఎలా గుర్తు పట్టగల ను? ఆశ్చర్యం! ఏమిటి? అక్కడ వెలుగు ఉండ దా? తప్పకుండా ఉంటుంది. కాని సూర్య రహిత ఆ వెలుగు ఎక్కడిది? ఆ దివ్యకిరణాలు ఎటువైపు నుండి వస్తున్నాయి!! ఆఁ… అల్లాహ్  అర్ష్‌ యొక్క వెలుగుతో స్వర్గమంతా కాంతు లీనుతూ ఉంటుంది. అంటే స్వర్గ వాసులపై అల్లాహ్  అర్ష్‌ యొక్క కాంతి ఉంటుంది. సుబ్హానల్లాహ్‌ా! సోదరా! సోదరీ! ఆలోచించు - ’అల్లాహ్  అర్ష్‌ యొక్క వెలుగు’! అందులో తీవ్ర ఎండగానీ, తీవ్ర చలిగాని ఉండదు. స్వర్గ వాసులకు ఎండ వేడి బాధించదు. చలి తీవ్రతా వేధించదు.
స్వర్గపు నేల అద్దంలా ఎంతో తెల్లగా నిగనిగ లాడుతూ ఉంటుంది. దాసుని దృష్టి అతని పాదాల క్రింది భూమిపై పడుతుంది. క్రింద గులకరాళ్ళున్నాయి…కాని అవి ఒట్టి రాళ్ళు కావు…వజ్రాలు, మణిమాణిక్యాలతో స్వర్గనేల చక్కగా అలంకరించబడి ఉంది. అదీ ఎక్కడా.. స్వర్గవాసి పాదాల క్రింద…దాసుడు వాటిని త్రొక్కుతూ ముందుకు సాగిపోతున్నాడు.  ప్రపంచంలో పసిడి కలలు కన్న ఓ మాన వుడా! రా! చూడు, ఈ రోజు నీవు ఎంతో విలువైనవని తలిచిన ఈ ముత్యాలు, ఈ పగ డాలు, ఈ మణిమాణిక్యాలు-ఒకటా రెండా.. లక్షలకొలది వజ్రవైఢూర్యాలు. దైవ దాసుడు వాటిని తన పాదాలతో త్రొక్కుకుంటూ వెళ్ళి పోతున్నాడు…చూడు, సర్వాధికారి అయిన అల్లాహ్‌ా తన దాసుణ్ణి ఎలా సత్కరిస్తున్నాడో! ఎన్ని అనుగ్రహాలతో సన్మానిస్తున్నాడో!!   దాసుడు స్వర్గంలో ప్రవేశించాడు. స్థలం కొత్త…నడిచే మార్గం…స్వర్గం కొత్త. మరి దాసుడు తన ప్రాసాదాన్ని తెలుసుకుంటాడా? ఎటువైపు ఉందో పసిగట్టగలడా? తప్పకుండా …ఎలాగయితే ఇహలోకంలో తన ఇంటిని గుర్తు పట్టేవాడో అలాగే గుర్తు పడతాడు.  తన నివాసం వైపు పరుగిడుతాడు. సోదరా! ఏం ఆలోచిస్తున్నావు? ఆ దాసుని ప్రాసాదం దేనితో నిర్మించబడి ఉంటుందనుకుంటున్నావు? మట్టి ఇటుకల నిలయమా! అద్దాల మేడనా!!… అవును కట్టడం ఇటుకలతోనే కట్టబడి ఉం టుంది, కానీ, ఒక ఇటుక వెండితో, ఒక ఇటుక పసిడితో, ఘాటయిన సువాసనగల కస్తూరి గచ్చుతో, మణిమాణిక్యాల కంకరతో, కుంకుమ పువ్వు వాసన గల ఒక విధమయి నటువంటి మట్టితో నిర్మించబడి ఉంటుంది.   ఈ ముత్యాలు, పగడాలు ప్రపంచంలో ఉన్న ట్లుగా ఉండవు. వాస్తవం ఏమిటంటే, స్వర్గపు ఏ వస్తువూ ఇక్కడి వస్తువుల్ని పోలి ఉండదు. ”భయభక్తులు గల వారికి వాగ్దానం చేయ బడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉం టుంది” (ఖుర్‌ఆన్‌-47:15) మరి.

దాసుడు మార్గాన సాగి పోతున్నాడు. అతని ముఖకవళికల్లో ఆశ్చర్యం కొట్టుకొచ్చినట్టు కన బడుతోంది. ఏం చూశాడో ఏమిటో!  అవును, ‘అక్కడ అణుమాత్రం కూడా కలుషితంకాని  స్వచ్చమయిన  నీరు గల సెలయేరులు ఉం టాయి’.ఆ కాలువలు ప్రపంచ కాలువల్ని పోలి ఉంటాయనుకుంటున్నావా?ముమ్మాటికీ కాదు; ఆ సెలయేరుల్లోని నీరు ఎప్పటికీ చెడిపోదు. వాటికిరు వైపులా ముత్యాలు అమర్చబడి ఉం టాయి. ఇంకా ఏముంటుంది? ”ఏ మాత్రం రుచి కోల్పోని స్వచ్ఛమయిన పాల నదులుం టాయి”. ఎంత త్రాగాలనుకుంటావో త్రాగు. జలకాలాడాలని ఉందా. సరే కానివ్వు.    ఇంకా, ”పానప్రియులకు అమిత రుచికరం గా ఉండే వారుణీ వాహినీలు ఉంటాయి”. మధురాతి మదురమయిన మద్యం కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి.
ఓ మానవుడా! ఇహలోకంలో అల్లాహ్‌ా నిషే ధించిన మద్యానికి బానిసయి స్వర్గపు మద్యా న్ని చేెజార్చుకున్నవాడా! చూడు, స్వర్గంలో మద్యం కాలువలు ప్రవహిస్తున్నాయి. ఇది కరు ణామయుని వారుణి. ఇది చేదుగా ఉండదు, సేవించే వారు మతిస్తిమితం కోల్పోవడం జర గదు. అది చాలా రుచికరంగా ఉంటుంది. అక్కడ ముఖబంధిత మధుకలశం కూడా ఆ దాసుని ముందు సమర్పించబడుతుంది. ”వారక్కడ కుర్చీలపై ఎదురెదురుగా కూర్చుం టారు. వారుణీ వాహిని నుండి నింపిన మధు పాత్రలు వారి ముందు ఉంచబడతాయి. అది కాంతిమంతమైన (విశేష) మధువు. సేవించే వారికి ఎంతో మధురంగా ఉంటుంది. దాని వల్ల వారి దేహారోగ్యానికి ఎలాంటి నష్టం వాటి ల్లదు. వారి బుద్ధీవివేచనలు కూడా మంద గించవు”. (ఖుర్‌ఆన్‌-37: 43-47) ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం ఏముందో? అదుగో అటు చూడు! ”ఎంతో నిర్మలమయిన తేనె ఝరులు (నిరంతరం) ప్రవహిస్తూ ఉన్నాయి”. సోదరా! తేనె తెట్లు కాదు, అక్ష రాల తేనె నదులు! అల్లాహు అక్బర్ !”అసలు ఇలాంటి అనుగ్రహాల కోసమే కర్మ శీలురు కృషి చెయ్యాలి, పోటీ పడాలి”.
దాసుడు తన ప్రాసాదాన్ని సమీపించాడు. కోట ప్రక్కనే ఉన్న ఓ గుడారును చూశాడు. అది కూడా ముత్యాలతో అలంకరించబడి ఉంది. దాని పొడుగు అక్షరాల అరవై మైళ్ళు. అందులో ప్రవేశించాడు. లోపల హూర్లు అన బడే స్వర్గపు సుకన్యలున్నారు. వారు ఎలా ఉం టారు? సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు, వారి చెంపల కెంపులు ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటాయి. అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు: ”మేము వీరిని ప్రత్యేకంగా సరికొత్త పంథాలో సృష్టించాము. వారిని కన్య లుగా చేశాము. వారు తమ భర్తలని అమితం గా ప్రేమిస్తారు. వయస్సులో సమంగా ఉం టారు.” (అల్‌ వాఖిఅహ్‌ా: 35)
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”స్వర్గం లో ప్రవేశించే మొట్టమొదటి సమూహంలోని ప్రజల ముఖాలు పున్నమి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాయి. వారి తర్వాత స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు ఆకాశంలోని అత్యంత ప్రకాశవంతమయిన నక్షత్రం వలే మెరిసిపోతూ ఉంటాయి. స్వర్గ వాసులు మల మూత్ర విసర్జన చేయరు. వారు ఉమ్మరు, ముక్కు కూడా చీదరు. వారి దువ్వెనలు బం గారంతో చేసినవై ఉంటాయి.   వారి  చెమట  కస్తూరి వలే సువాసనలు వెదజల్లుతూ ఉం టుంది. వారి ఉంగరాల్లో సుగంధభరిత మయిన సామ్రాణి జ్యలిస్తూ ఉంటుంది. వారి భార్యలు విశాలమయిన కన్నులు గల స్వర్గ కన్యలై ఉంటారు…”. (ముత్తఫఖున్‌ అలైహి) ”వారు ఎంత అందంగా ఉంటారంటే, విప రీతమయిన అందం మూలంగా వారి పిక్కల మాంసంలో నుంచి లోపలి గుజ్జు కూడా కన బడుతూ ఉంటుంది”. (బుఖారీ)
స్వర్గవాసులు వస్త్రాలు ధరిస్తారు. అవెక్కడి నుండి వస్తాయి, ఎలా ఉంటాయనుకున్నావు? అబ్దుల్లాహ్  ఇబ్నె అబ్బాస్‌ గారి మాటల్లో - ”స్వర్గంలో ఓ ప్రత్యేకమయిన వృక్షం ఉంటుం ది. దానికి దానిమ్మకొమ్మల్లాంటి పండ్లు కాస్తా యి. స్వర్గవాసి ఏదయినా దుస్తులు ధరించ దలచుకుంటే, ఆ చెట్టు రెమ్మ అతని దగ్గర వస్తుంది. తరువాత దానికి కాసిన పండ్లలో ఒక పండు విచ్చుకుంటుంది. అందులో డెబ్భయి రకాల దుస్తులు ఉంటాయి. స్వర్గవాసి వాటిని తీసుకోగానే ఆ రెమ్మ యథాతథంగా మారి తిరిగి తన స్థానంలోకి వెళ్ళి పోతుంది”.     (తర్గీబ్‌ -ఇబ్నె అబిద్దున్యా)  ”స్వర్గపు దుస్తులు మాసి పోవడంగాని, చీకి పోవడంగాని జరగదు. స్వర్గవాసుల యౌవనం కూడా ఏ మాత్రం తగ్గదు”. (అహ్మద్‌, తిర్మిజీ)
స్వర్గ వాసులు పట్టు వస్త్రాలు ధరిస్తారు. పట్టు వస్త్రాలపై కూర్చుంటారు. పట్టు పడకలపై నిద్రిస్తారు. పట్టు కుర్చీలపై కొలువుదీరు తారు. థ దిశల నుండి పట్టు జడి వానలా కురుస్తూ ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”స్వర్గవాసులు బంగారు జలతారు అంచులుం డే పట్టు పరుపులపై మెత్తటి దిండ్లకు ఆనుకొని కూర్చుంటారు”. (ఖుర్‌ఆన్‌-55:76)  ”ఆ స్వర్గంలో సెలయేర్లు ఉంటాయి. ఎత్తయి న ఆసనాలుంటాయి. (త్రాగటానికి) మధు పాత్రలు కూడా పెట్టబడి ఉంటారయి. ఇంకా వరుసలు వరుసలుగా దిండ్లు పేర్చబడి ఉం టాయి. పట్టు తివాచీలు పరచబడి ఉం టాయి”. (ఖుర్‌ఆన్‌-88:12-16) ”వారు రత్నఖచిత ఆసనాల మీద మెత్తటి దిండ్లకానుకొని పరస్పరం ఎదురెదురుగా కూర్చుంటారు”. (56: 15,16)  ”వారి సమావేశాలలో నిత్య బాలకులు వారుణీ వాహిని నుండి స్వచ్ఛమయిన మధువుతో నిండిన గిన్నెలు, గ్లాసులు, కూజాలు తీసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు” (ఖుర్‌ఆన్‌-56: 17, 18)
మరి వారు ఎలా ఉంటారు? ”వారి సేవ కోసం నిత్య బాలలు అటుఇటూ పరుగిడుతూ ఉంటారు. నీవా పిల్లల్ని చూస్తే చెదరిన ఆణి ముత్యాల్లా కన్పిస్తారు.    ”నీవక్కడ ఎటు చీసినా రంగ రంగ భోగ భాగ్యాలు, మహోన్నత సామమ్రాజ్య వైభ వాలు కన్పిస్తాయి”.(ఖుర్‌ఆన్‌-76: 19,20)  దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”నక్ష త్రాలపై పూర్ణ చంద్రునికి ఎంత ఔన్నత్యం ఉంటుందో, ఈ బాల సేవకులపై వారి చేత సేవ చేయిపించుకునే వారికి అంత ఔన్న త్యం ఉంటుంది”. (తఫ్సీర్‌ మజ్హరీ)  స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అం చులు గల తివాచీలపై దిండ్లకు ఆను కొని కూర్చొని ఉంటారు. వారు ఏదయినా పండు తీసుకోదల చినప్పుడు స్వయంగా ఆ పండ్ల రెమ్మ పరమ విధేయురాలిగా వారి దగ్గరికి వచ్చేస్తుంది. స్వర్గవాసులు నిలబడి ఉంటే ఆ రెమ్మ పైకి లేచి అతని దగ్గరకు వస్తుంది. అతను కూర్చోని ఉంటే లేదా పడుకోని ఉంటే అది అతని దగ్గరకు వంగి వస్తుంది. (తఫ్సీర్‌ ఇబ్ను కసీర్ )
ప్రపంచంలో మనిషి ఆశించేదేమిటి? బాగా సంపాదించాలని. తన ధన కన నిధులు పెరగాలనీ, తనను ప్రేమించే మంచి భార్య ఉండాలనీ, సదా తన సేవలో తరించే మంచి సంతానం ఉండాలనీ, ఉండటానికి ఓ పెద్ద బంగలా కావాలనీ, ఆ బంగలాలో స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉండాలనీ, చుట్టూ సువాసనలు వెదజల్లే అందమైన పూలవనం ఉండాలనీ, ఆ వనంలో రంగురంగుల కుర్చీలు అమర్చబడి ఉండాలనీ, ఆకుర్చీలపై తను కొలువుదీరి ఉంటే- సేవకులు కావా ల్సిన ప్రతి వస్తువునీ తన వద్దకు చెర్చాలనీ, తనకు ఎలాంటి బాధగానీ, దుఃఖంగానీ కలగరాదనీ, ఏ విధమయినటువంటి నష్ట వాటిల్లరాదనీ, తను ఏ చీకూచింతా లే కుండా ప్రశాంతంగా జీవించాలనేగా మనిషి కోరుకునేది!?
”ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువు గురించి ఏవిషయం నిన్ను మోసం లో పడవేెసింది? యదార్థానికి ఆయనే నిన్ను పుట్టించాడు. నిన్ను చక్కగా చీర్చిదిద్దాడు. ఆపైన తగురీతిలో నిన్ను పొందికగా అమ ర్చాడు. తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు”. (ఇన్ఫితార్‌: 6-8) ”ఏమిటి, నిన్ను మట్టితో చేసి, ఆ తార్వత వీర్యపు బిందువుతో సృష్టించి,  ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (అల్లాహ్‌ానే) తిరస్కరిస్తున్నావా?”(కహఫ్‌:37)
మానవులు సహజంగా కోరుకునే లోకం స్వర్గ లోకం. ఈ ప్రపంచ జీవితం సుఖ దుఃఖాల సమ్మిశ్రమం. కావున మన ఆశలన్నీ ఇక్కడ తీరడం అసాధ్యం. అవి స్వర్గంలో తీరుతాయి. అది మనిషి కొరకు అనుగుణమయినది. అది సజ్జనుల శాశ్వత నివాసం కూడా. స్వర్గలోకం – అది పూర్తిగా తేజోమయమయిన లోకం. అక్కడ ఆనందం, సౌఖ్యాలు, ఉత్తమ అనుభూ తులు ఉంటాయి. అక్కడ కోరుకున్న కోరిక లన్నీ మొదటి నుండే లభ్యమయి ఉంటాయి. అది మరణరహితమయిన, వెలుగులతో నిండి న, శాశ్వత తేజస్సునిచ్చే, పతన రహితమయిన స్థలం. అక్కడ మన చిరకాల కోర్కెలన్నీ ఈడే రుతాయి. ఆ స్వర్గ లోకంలో కామం, నికా మం, సుధ, తృప్తి, ఆనందం, మోదం, ముదా వహం, ప్రమోదం ఉంటాయి. అక్కడ వృద్ధాప్య ముగానీ,అలుపుసొలుపులుగానీ, భయ భీతు లుగాని ఉండవు. ఈర్ష్యగానీ, క్రోధావేశాలు గాని ఉండవు. అటువంటి పరిశుద్ధ నందన వనాలు పుణ్యాత్ముల విలాస ప్రదేశాలు. అక్కడ అశుద్ధమైన నీచమయిన వస్తువు ఏదీ లేదు. అక్కడ సువాసనతో కూడిన గాలులు – మలయ పవనాలు వీస్తాయి. అక్కడి దైవ స్తోత్రాలు వీనులకు విందుగా, హృదయాలను రంజింపజేసేవిగా ఉంటాయి. అక్కడ శ్రమ గానీ, బాధగాని ఉండదు. ఈ లోకం సత్కర్మల ఫలితంగా లభించే లోకం. అక్కడ ప్రతి మనిషి శరీరం అతని కర్మలకు అనుగుణంగా తేజోమ యమయి ఉంటుంది. దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు:  ”స్వర్గంలో ఒక బజారు ఉంటుంది. స్వర్గ వాసులు ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్తారు. అక్కడ (ఒక విధమయిన) ఉత్తర పవనాలు వీస్తాయి. అవి స్వర్గవాసుల ముఖాలపై, దుస్తు లపై సువాసనను వెదజల్లుతాయి. దాంతో వారి అందం ద్విగుణీకృతం అయిపోతుంది. అలా వారు ఎంతో అందంగా మారి తమ తమ నివాసాలకు తిరిగి వెళ్తారు. వాళ్ల భార్యలు వారిని చూసి ’దైవసాక్షి! మీరు మా నుండి వేరయినప్పటికంటే ఇప్పుడు మీ అందం రెట్టింపయింది’ అనంటారు. వారీ మాట విని ’అల్లాహ్  సాక్షి! మేము మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీ అందం కూడా రెట్టింపయింది’ అనంటారు”. (ముస్లిం)
ఈ సుఖసంతోషాలని అనుభవిస్తూ ఉండగా అల్లాహ్‌ా వైపు నుండి పిలుపు వస్తుంది. ’మీకు ఇంకేమయినా కావాలా? అడగండి, ఇస్తాను’ అనంటాడు.  దానికి వారు: ’ప్రభూ! నువ్వు మా ముఖాలను తేజోవంతం చేయలేదా? మమ్మల్ని నరకం నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేయ లేదా? అని సవినయంగా విన్న వించుకుం టారు’. (ముస్లిం)
అల్లాహ్  స్వర్గవాసుల్ని సంబోధిస్తూ – స్వర్గ వాసులరా! అని పిలుస్తాడు. దానికి వారు ’మేము నీ సన్నిధిలో హాజరయి ఉన్నాము. ప్రభూ! మీ ప్రతీ ఆదేశాన్ని శిరసా వహించ డానికి మేము సదా సిద్దంగా ఉన్నాం, సెలవి య్యండి’. అనంటారు. అప్పుడు అల్లాహ్  ”మీరు నా పట్ల సంతుష్టులయ్యారా?” అని అడుగుతాడు. ’ప్రభూ! నువ్వు మాకు నీ దాసు లకెవ్వరికీ ప్రసాదించని మహాభాగ్యాలు ప్రసా దించావు. అలాంటప్పుడు మేము ఎందుకు సంతుష్టులము కాము?’ అంటారు స్వర్గవా సులు. అప్పుడు అల్లాహ్‌ా- ’సరే, ఇప్పుడు నేను మీకు ఇంతకంటే  శ్రేష్ఠమయిన మహా భాగ్యం ప్రసాదించనా?” అంటాడు. ’ఇంత కంటే శ్రేష్ఠ మయిన మహా భాగ్యం ఇంకేముంటుంది’ అంటారు స్వర్గవాసులు. ”వినండి. బాగా వినండి. నేను మీకు శాశ్వతంగా నా ప్రసన్నతా భాగ్యం ప్రసాదిస్తున్నాను. ఇక ఎప్పుడూ నేను మిమ్మల్ని ఆగ్రహించను”. (బుఖారీ, ముస్లిం)
అయితే  ఓ మా ప్రభూ! నీ దర్శనాభాగ్యాన్ని మాకు అనుగ్రహించు. అది తప్ప మాకు ఇంకే మీ వద్దు. అదే మా ఆశలకి ఆఖరి హద్దు’ అని వేడుకుంటారు.  ఆ తర్వాత అల్లాహ్  దివ్య దర్శనం కోసం తెర ఎత్తివేయబడుతుంది. అప్పుడు పరాత్పరుడ యిన అల్లాహ్‌ా స్వర్గవాసుల ముందు ప్రత్యక్ష  మవుతాడు. అపూర్వమయిన ఈ దివ్య దర్శ నంతో స్వర్గవాసుల అణువణువూ పులకి స్తుంది).ఒకే ఒక్క చూపు! ఏం జరుగుతుంది?
స్వర్గాన్ని ఒక చూపు చూసినప్పుడు ప్రాపంచిక భోగభాగ్యాలను, దుఃఖవిషాదాలను మరచిపో యినా ఆ దైవ దాసులే, అల్లాహ్  దివ్య దర్శనం చేసుకుంటున్నంత సేపూ స్వర్గపు మరే మహా భాగ్యం వైపు దృష్టి సారించరు. వారు సృష్టికర్త సౌదర్యానికి ముగ్దులయి తన్మయం చెందుతూ ఉంటారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం-’ఒకే ఒక్క దర్శనంలో కొన్ని వేల సంవత్సరాలు గడచిపోతాయి; కానీ ఆ ధ్యాసే దాసులకు ఉండదు’-అటువంటి మహా మహి మాన్వితమ యినది అల్లాహ్  దివ్య దర్శనం. సుబ్హానల్లాహ్ ! అల్లాహ్  ఈ దివ్య దర్శనం కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుందా? తిరిగి మళ్ళీ మళ్ళీ దర్శించుకుని తాదాత్మ్యం చెందే భాగ్యం  స్వర్గవాసులకు లభించదా?
హజ్రత్‌ అబ్దుల్లాహ్  బిన్‌ ఉమర్‌ (ర) ఈ విధంగా సెలవిచ్చారు: ”స్వర్గంలో హోదాల రీత్యా అధమశ్రేణి స్వర్గవాసికి లభించే సామ్రా జ్యంలోని తోటలు, ఆసనాలు, భార్యలు, సేవ కులు, ఇతర మహా భాగ్యాలు రెండు వేల సంవత్సరాల ప్రయాణమంతా పరిధిలో విస్తరించి ఉంటాయి. పోతే అత్యున్నత శ్రేణికి చెందిన స్వర్గవాసికి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అల్లాహ్‌ా దివ్య దర్శన మహా భాగ్యం లభిస్తుంది”. ఆ తర్వాత దైవప్రవక్త (స) వారు ఖుర్‌ఆన్‌లోని ఈ (75:22) సూక్తి పఠిం చారు: ”ఆ రోజు కొందరి ముఖాలు కళ కళ లాడుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుం టాయి. వారు తమ ప్రభువుని ప్రత్యక్షంగా చూస్తుంటారు”. (తిర్మిజీ)  చివరిగా స్వర్గవాసులకు అల్లాహ్  ఆశీర్వాదం (సలాం)తోపాటు వారు స్వర్గంలో కలకాలం ఉంటారన్న శుభవార్త కూడా విన్పించ బడుతోంది.
మిత్రమా! నీకు  కలగబోయే ఈ మహా భాగ్యం గురించి ఎప్పుడయినా ఆలోచించావా! ఏ మార్గాన్ని అవలంబించాలో నీ అంతరాత్మ ను అడుగు. ఓ బృందం స్వర్గవనాలలో విహరి స్తుంది.మరో బృందం నరకాగ్నికి ఆహుతి అవు తుంది. నీ ప్రభువు సత్య మార్గాన్ని స్పష్టం చేసేశాడు. అపమార్గాన్ని విడమరచి చెప్పే శాడు. ఇక నువ్వు కృతజ్ఞుడవై జీవించవచ్చు లేదా కృతఘ్నుడవై బ్రతకవచ్చు.  ”విశ్వసించిన ప్రజలారా! మీ ప్రభువు క్షమా భిక్ష  వైపునకు, భూమ్యాకాశాలంతటి విశాలమ యిన స్వర్గధామం వైపునకు పోయే మార్గంలో పోటీ పడండి”. (అల్‌ హదీద్‌: 21)

కామెంట్‌లు లేవు: