1, మే 2013, బుధవారం

దివ్య ఖుర్‌ఆన్‌ మానవీయ జీవనికి ధర్మదాయి


   
మా నవుడు సన్మార్గాన్ని వదలి సత్యం, ధర్మం, న్యాయాన్ని మరచి అంధకారంలో కొట్టు మిట్టాడుతూ, జీవితాన్ని వెళ్ళబోస్తున్నపుడు మాన వునికి జీవనజ్యోతిలా వెలుగుతూ రుజుమార్గాన్ని చూపింది దివ్య ఖుర్‌ ఆన్‌. పవిత్ర గ్రంథమయిన ఖుర్‌ఆన్‌ గురించి అల్లాహ్‌ా ఈ విధంగా తెలియ జేస్తున్నాడు: ''యదార్థం ఏమిటంటే ఈ ఖుర్‌ఆన్‌ పూర్తిగా సరియైన మార్గాన్ని చూపుతుంది''. (బనీ ఇస్రాయీల్‌ 9,10)
  ఈ పవిత్ర ఖుర్‌ఆన్‌ దైవగ్రంథం ఎవరి తరపున వచ్చింది? మానవునికి ఎలా లభ్యమయింది? దీన్ని ఎవరు సృష్టించారు? మానవుడు సృష్టించడానికి వీలుకాని గ్రంథం ఇది. ఈ గ్రంథానికి మూలకర్త ఎవరు? ఒక్కసారి ఆలోచించు, సర్వలోకాలకు మూలకారకుడై సమస్త జగత్తును, సర్వ మానవాళిని నడిపిస్తూ ఆకాశంలో సింహాసనం మీద ఉన్న, పరమేశ్వరుడు అయిన అల్లాహ్‌ సృష్టించాడు - ఆ గ్రంథం మానవాళికి ఏ విధంగా చేరిందంటే దైవదూతల్లోకి పెద్దవారైన జిబ్రయీల్‌ (అస్సలామ్‌) ద్వారా. అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) పై పవిత్ర దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ సందేశవాక్కు 23 సంవత్సరాల కాలంలో పూర్తి అయింది. 
     ఏకేశ్వరుడు సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మానవునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ''అల్లాహ్‌ పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖుర్‌ఆన్‌, ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్‌ కితాబ్‌కు వివరణ, ఇది విశ్వ పాలకుని తరుపు నుండి వచ్చిందనే విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు''.  (యూనుస్‌ 37)
  దివ్యఖుర్‌ఆన్‌ అవతరించిన రాత్రి వెయ్యి నెలలకంటే గొప్పది. ఆ రాత్రి ఎప్పుడంటే ఖచ్చితంగా చెప్పలేం. రమజాన్‌ మాసంలో, ఆఖరి 10 రోజుల్లో ఒక రాత్రి అని మనకు (హదీస్‌ల ద్వారా) తెలుస్తుంది. ఈ పవిత్రమైన ఖుర్‌ఆన్‌ మధురానుభూతితో పారాయణం చేస్తుంటే రోజులు ఏ విధంగా గడచిపోతాయో తెలియదు. రమజాన్‌ నెలలో ఉపవాసాలు పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
  సర్వేశ్వరుడు అయిన అల్లాహ్‌ా రమజాన్‌ నెల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ''పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించిన నెల రమజాన్‌ నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇకనుండి రమజాన్‌ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసాలు ఉండాలి''. (అల్‌ బఖర 185)
  దివ్యఖుర్‌ఆన్‌ మానవున్ని హెచ్చరిస్తుంది: ''మానవుడా! నువ్వు అవిశ్వాసానికి పాల్పడితే పరలోకంలో అల్లాహ్‌ా దగ్గర శిక్ష తప్పదని. దివ్యఖుర్‌ఆన్‌ అవిశ్వాసి  (ధర్మం తప్పినవాని గురించి) గురించి ఈ విధంగా బోధిస్తుంది:  అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలి అనే తీర్పూ ఇవ్వబడదు. వారి నరక యాత నను ఎంతమాత్రం తగ్గించటమూ జరగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికీ ప్రతిఫలం ఇస్తాము. వారు అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఇలా అంటారు. ''మా ప్రభూ! మమ్మల్ని ఇక్కడ నుండి బయటకు తియ్యి. మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేయటానికి'' (వారికి ఇలా జవాబు ఇవ్వబడుతుంది) గుణపాఠం నేర్చుకోదలచినవాడు గుణపాఠం నేర్చుకోవటానికి సరిపడిన ఆయష్షును మేము మీకు ఇవ్వలేదా! ఇక్కడ యాతనను రుచి చూడండి. దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసేవాడెవ్వడూ లేడు. (ఫాతిర్‌ 36,37)
అవిశ్వాసిగా జీవించకు
  సర్వలోకాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు అయిన అల్లాహ్‌ాను మరచి ఎందరో దేవుళ్ళు ఉన్నారని తలచి, బహుదైవారాధన (షిర్క్‌కు పాల్పడకు), వ్యభిచారం దరిదాపులకు కూడా పోకు. అది అతి నీచకరమైన బహుచెడ్డ మార్గం, దొంగతనాలు చేయకు, పరాయి సొమ్ము పాములాంటిది. హత్యలు చెయ్యకు, మద్యం పుచ్చుకోకు, జూదం ఆడకు, దేవుడి మీద దొంగ ప్రమాణాలు చెయ్యకు, పిసినారితనం చూపకు, స్త్రీలపై అభాండాలు మోపకు, పక్కవారి ఆస్తిని కాజేయకు, సాటి మనిషిని ఎగతాళి చెయ్యకు, వడ్డీని ఆశించకు, స్త్రీలను పురుషులను హింసించకు అని ఖుర్‌ఆన్‌ హెచ్చరిస్తోంది.
(1) బహుదైవారాధన (షిర్క్‌) గురించి ఈ విధంగా తెలియచేస్తుంది: అల్లాహ్‌ా క్షమించనిది కేవలం షిర్క్‌ను మాత్రమే (అన్‌ నిసా 47,48)
(2) వ్యభిచారం: ''వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. అది అతి నీచకార్యం, బహు చెడ్డ మార్గం''. (బనీ ఇస్రాయీల్‌ 32)
(3) దొంగతనం: దొంగ - స్త్రీ అయినా పురుషుడైనా ఉభయుల చేతులూ నరకండి. ఇది వారి సంపాదనకు ప్రతిఫలం. అల్లాహ్‌ తరుపు నుండి గునపాఠం నేర్పే శిక్ష. (అల్‌ మాయిద)

(4) హత్యలు: మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్‌ాకు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. హింసా దౌర్జన్యాల ద్వారా అలా చేసేవాణ్ణి మేము తప్పకుండ అగ్నిలో పడవేస్తాము. (అన్‌ నిసా: 29,31) 
పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండ.ి మేము మీకూ ఉపాధి నిస్తున్నాము వారికీ ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి. బహిరంగమైనవైనాసరే లేక గోప్యమైనవైనాసరే. సత్యంతో తప్ప అల్లాహ్‌ా పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్నీ హత మార్చకండి. (అల్‌ అన్‌ఆమ్‌ 151,153)
(5) స్త్రీలపై అభాండం మోపడం: శీలవతులు, అమాయికలు అయిన విశ్వాసం గల స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ, పరలోకం లోనూ శపించబడ్డారు. వారికి పెద్ద పెద్ద శిక్ష పడుతుంది. (అన్‌ నూర్)
(6) పిసినారితనం : అల్లాహ్‌ా తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించిన ప్పటికీ పిసినారితనం చూపేవారు, ఈ పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారికొరకు ఎంతో హానికరమయినది. వారు తమ లోభత్వంతో కూడబెడుతూ ఉన్నదే ప్రళయంనాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. (ఆలి ఇమ్రాన్‌ 180)

ప్రియమైన అమ్మకు...!

ప్రేమ - ఎన్నో హృదయాల, ఎన్నో జీవితాల కలయిక ప్రేమ. ప్రేమ ఎప్పుడూ స్వార్థాన్ని కాదు, త్యాగాన్ని నేర్పుతుంది. తల్లీ బిడ్డల బంధంలో, అన్నా చెల్లెళ్ల అనురాగంలో, అవ్వా మనవళ్ళ వాత్సల్యభరిత బంధంలో, ఆలుమగల అన్యోన్నతలో, దేవుడూ దాసుడి సంబంధంలో ఒకరిపై ఒకరికున్నది కూడా అవిభాజ్యమైన ప్రేమే! అయితే, ఆకర్షణనే ప్రేమని భ్రమించేవారు కొందరైతే, కాలక్షేపాన్ని ప్రేమగా అభివర్ణించేవారు మరి కొందరు. ఉన్మాదాన్ని, పైశాచికాన్ని ప్రేమగా చెప్పుకునేవారు కొందరైతే, క్రూరమైన ఆలోచనల్ని పుట్టించేది, హద్దులు మీరేలా ప్రేరేపించేది ప్రేమ అని భాష్యం చెప్పుకునేవారు కొందరు. 


ప్రేమ - ఎన్నో హృదయాల, ఎన్నో జీవితాల కలయిక ప్రేమ. ప్రేమ ఎప్పుడూ స్వార్థాన్ని కాదు, త్యాగాన్ని నేర్పుతుంది. తల్లీ బిడ్డల బంధంలో, అన్నా చెల్లెళ్ల అనురాగంలో, అవ్వా మనవళ్ళ వాత్సల్యభరిత బంధంలో, ఆలుమగల అన్యోన్నతలో, దేవుడూ దాసుడి సంబంధంలో ఒకరిపై ఒకరికున్నది కూడా అవిభాజ్యమైన ప్రేమే! అయితే, ఆకర్షణనే ప్రేమని భ్రమించేవారు కొందరైతే, కాలక్షేపాన్ని ప్రేమగా అభివర్ణించేవారు మరి కొందరు. ఉన్మాదాన్ని, పైశాచికాన్ని ప్రేమగా చెప్పుకునేవారు కొందరైతే, క్రూరమైన ఆలోచనల్ని పుట్టించేది, హద్దులు మీరేలా ప్రేరేపించేది ప్రేమ అని భాష్యం చెప్పుకునేవారు కొందరు. 
   అలా ఎవరికి వారు తమకు నచ్చిన తాత్పర్యాలు చెప్పుకుంటూ భ్రమల వలయంలో చిక్కుకొని ఎటూ పాలుపోక, ఏం చేయాలో తోచక ఘోరమైన నేరాలకు, అఘాయిత్యాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నారు. తాము నష్టపోవడమే కాక ఎన్నో కుటుంబాలను శోక సముద్రంలో ముంచేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విధంగా తెలిసీ తెలియని వయసులో మాయలోకానికి మోసపోయి, నిండు ప్రాణాల్ని వదిలిన ఓ అమ్మాయి వాస్తవ గాథను ఆధారంగా చేసుకుని ఈ వ్యాసం వ్రాయబడుతోంది. ఒకవేళ మరణించిన ఆ అమ్మాయి మౌనం వీడి, మాట్లాడి ఉంటే ఎలా ఉండేదో... అన్న ఊహకు ప్రతిరూపమే ఈ వ్యాసం. ఈ వ్యాసం వల్ల ప్రతి హృదయంలో కొద్దో గొప్పో మార్పు వచ్చి తీరుతుందని, ప్రజలు ముఖ్యంగా తల్లీదండ్రులు కొత్త కాంతికి కళ్ళు తెరవగలరని విశ్వాసం.   సారీ అమ్మా...! నా బాధ నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పకోను చెప్పు....అమ్మా....! నిజంగా నాకు ఆ  క్షణంలో ఏమీ తోచలేదు... ఎవరైనా నా తరఫున మాట్లాడే వ్యక్తి ఒక్కరుంటే చాలు అన్పించింది... మనసున ఉన్నదంతా చెప్పాలన్పించింది... లిఖిత పూర్వకంగా నా మనోవేదనను భద్రపర్చాలన్పించింది.... అమ్మమ్మ ఒడిలో కాసేపు నిద్రపోవాలన్పించింది.... నీ కౌగిట్లో చేరి కళ్ళు కాయలు కాసేదాక ఏడ్వాల న్పించింది.... నా ప్రేమ గురించి, నాకు జరిగిన అన్యాయం గురించి నాన్నతో మనసు విప్పి మాట్టాడాలన్పించింది.... నా మనోగతాన్ని చెల్లితో చెప్పుకోవా లన్పించింది... ఇన్ని ఆలోచనలు నన్నెంత ఒత్తిడికి గురి చేస్తున్నాయో.... ఎంత పిచ్చెక్కిస్తున్నాయో చెప్పుకోవాలన్పించింది.... కానీ నేను ధైర్యం చేయలేక పోయాను.... ఏ ముఖంతో మీ ముందుకు రావాలని లోలోన కుమిలిపోయాను... నాలుగు గోడల మధ్య నన్ను నేను బంధించుకున్నాను... నా మెదడును, హృదయాన్ని పిండేసే పిచ్చి ఆలోచనలు... వాటిని ఎలా అధిగమించాలో తెలియక నేననుభవించిన నరకం  వర్ణనాతీతం అమ్మా!
  ఎన్నో రాత్రులు నిశిరాత్రి పశ్చాత్తాపంతో గడిపాను... దైవ సమక్షంలో నా తప్పుల్ని ఒప్పుకున్నాను...  కానీ    మీతో    అనలేక  పోయాను... వాటి నుండి పారిపోవాలను కున్నాను... జీవితం నుంచే పారిపోతానని ఆ  క్షణం నేను ఊహించనన్నా ఊహించ లేదు.
 ఆ  క్షణం... నేను తుది శ్వాస వీడిన భయంకర  క్షణం... ఆ  క్షణం నాన్న నా దగ్గరకొచ్చి నన్ను ఒళ్ళో తీసుకును అభయమిస్తూ నాలుగు మాటలు మాట్లాడితే బాగుండు అన్పించిందమ్మా... నిజంగా నాన్న గారి మాటలకు అంత శక్తి ఉందని నాకు బాగా తెలుసు... ఆయన ప్రసంగాలు శ్రోతల్ని ఎలా ఉర్రూతలూగిస్తాయో, ఎలా కన్నీళ్ళు పెట్టిస్తాయో అనుభవపూర్వకంగా నాకు తెలుసు... కాని నిజం నాన్న గారికి తెలీదు... ఆ నిజం ఆయన్ను నిప్పులా ఎక్కడ దహించి వేస్తుందోనన్న భయంతో నేనే చెప్పలేదు... అసలు ఆ నాలుగు రోజులూ నాన్నగారి ముఖం కూడా నేను చూడలేక పోయాను... ఆయనతో మాట్లాడలేక పోయాను... నాకిష్టమైన కోడి కూర చేసి ప్లేటు నిండా అన్నం పెట్టి 'అబ్బా జాన్‌! భోజనానికి రండీ' అని పిలువలేక పోయాను... అమ్మా! ఇవన్నీ నన్ను రోజుకి వేల సార్లు బాధించాయి... నా కంటి మీద కునుకు లేకుండా చేశాయి... అమ్మా...! నీకు తెలిసో తెలియదో... ఎన్ని  సార్లు నీ ఒడిలో వాలిపోయానో...  నీ  చీర   కొంగు  అప్పుడప్పుడూ తడిసిపోతూ ఉండేదే...! అవన్నీ నా కన్నీళ్ళేనమ్మా! ఏం చేయను... మరీ దుఃఖం ఆగనప్పుడు...!!
అమ్మా...! నేను అలా చేయడానికి కారణాలు లేకపోలేదు... కన్ను గీటడాలు, సైగ చేయడాలు, ఏకాంత కలయికలు తప్పని తెలిసి కూడా... ఒక పరాయి స్త్రీ మరో పరాయి పురుషుడితో ఏకాంతంలో ఉంటే మూడోవాడుగా షైతాన్‌ వారికి తోడవుతాడు అని విని కూడా... చెట్టాపట్టా లేసుకుని, సిగ్గు విడిచి మరీ షికార్లు తిరిగాను... ఇది నిజమైన స్త్రీ స్వేచ్ఛకు ప్రతిబింబం అని లోలోన మురిసి పోయాను... మానవ రూపంలో తోడేళ్ళుం టాయని... ఆ  క్షణం.. నేను తెలుసుకోలేక పోయాను..., తుమ్మెద లాంటి స్త్రీ స్వర్గపు సువాసనకు సైతం నోచుకోదు' అన్న మాట నాకు తట్టలేదు... 'శీలమే స్త్రీ అసలు సంపద' అని నాకన్పించలేదు... కోరికల మజాలు జుర్రుకోవడమే నా పరమావధి... షైతాన్‌ నన్ను అలా ఇరికించాడు... రేయింబవళ్ళు నిర్విఘ్నంగా సాగే ఫోన్‌ కాల్స్‌... చాటుమాటు కలయికలు... ఇంటర్నెట్‌ చాటింగులు... నన్ను ఈ పాపం చేసేలా ఉసిగొల్పాయి... నన్ను నిలువునా ముంచేశాయి... అమ్మా..! నీకు గుర్తుండే ఉంటుంది... నాన్నంటుండేవారు   'నా బిడ్డ  నిప్పు' అని. ఆ నిప్పే ఆయన కీర్తి ప్రతిష్టల్ని, మాన మర్యాదల్ని  మంట గలుపుతుంది అని ఆ  క్షణం ఆయన సైతం ఊహించి ఉండరు... ఆయనకు నా మీదున్న మమకారం, నమ్మకం అటువంటిది... నా బిడ్డ ఏది చేసినా మంచే చేస్తుందన్నది ఆయన విశ్వాసం... 
అమ్మా! నేను విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డానమ్మా... ఎంతో మంది నమ్మకాలతో నేనాడుకున్నానమ్మా... ఇప్పుడు నాకన్పిస్తుందమ్మా... నేనెవర్నీ మోసం చేయలేదు... నన్ను నేను మోసం చేసుకున్నాను... ఎవర్నీ గెలిచి రాలేదు.. నాపై నేనే ఓడిపోయాను... నన్ను నేనే కోల్పోయాను... ఇవన్నీ ఇప్పుడర్థమవుతున్నాయమ్మా!!

  ఇవన్నీ చెప్పి నేను చేసిన నిర్వాకాన్ని సమర్ధించుకుంటున్నానని అనుకోకు... ఆ ఉద్దేశం నాకు లేదు కూడా... నిజంగానే నేను తప్పు చేశాను... తప్పంతా నాదే... ఇందులో మీ ప్రమేయంగానీ, శిక్షణాలేమి గాని లేదు... మీ తర్ఫీదు మంచిదే. నా యౌవనమే నాతో ఈ పని చేయించింది... నేను అలా చేసి ఉండకూడదు. నీకు తెలుసా అమ్మా... నేను ఈ పని ఎంతో ఒత్తిడి మీద ఇష్టం లేకుండా చేశానని... ఒక తప్పు జరిగిపోయిన తర్వాత 'ఆత్మహత్య చేసుకునేవారు నరకంలో శాశ్వతంగా ఉంటారని' తెలిసి కూడా నేను మరో నేరానికి పాల్పడుతున్నాను... దేవుడు  క్షమిస్తాడన్న ఆశ ఈ  క్షణం కూడా నాలో బలంగానే ఉంది... ప్రతి స్లీపింగ్‌ పిల్‌ మింగేటప్పుడు పుట్టెడు దుఃఖాన్ని అనుభ వించాను తెలుసా అమ్మా! అలా నేను మింగే  ఒక్కొక్క నిద్ర మాత్ర నీ తరపున, నాన్న  తరపున నన్ను కొన్ని వేల ప్రశ్నలు అడిగాయి తెలుసా! వాటికి సమాధానం  చెప్పుకోలేక... నాలో నేను ధైర్యాన్ని పెంచుకోలేక మరో మాత్ర వేసుకునేదాన్ని... అమ్మా..? నీకో నిజం చెప్పనా... అలా నేను చేసేటప్పుడు కూడా ఎందుకో మీతోనే ఉంటానని పించింది తప్ప, దూరంగా... మరీ చేరుకో లేనంత దూరంగా వచ్చేస్తానని ఊహించనే లేదు. మీ ఆశలపై నీళ్ళు చల్లిన నా నిర్ణయాన్ని గుర్తు చేసుకుని... రెప్పలు అలసిపోయేలా ఏడుస్తున్నాను...! 
  నాకిప్పుడనిపిస్తుంది... తెలియనితనంతో చేసిన తప్పుకి నాకు నేనిచ్చుకున్న శిక్ష  సరైనదేనా? అని. నా స్వార్థం కోసం మిమ్మల్నందర్నీ బాధించడం సహేతుకమా? అని... ఆ మాత్రం దానికి జీవితాన్ని, అంతకంటే విలువైన మిమ్మల్ని, మీ ప్రేమను వదులుకుని ఇలా అర్ధాంతరంగా నిర్ణయం తీసుకోవాలా అని. అంతెందుకు... జీవితాంతం నిన్ను నాన్నను ప్రేమిస్తూ ఉండిపోతే ఏం నష్టం... నా లక్ష్యాలకు మీరు అడ్డు కారు... నా అభివృద్ధికి మీరు ఆటంకం కాదు... నా రక్షణకు మీరు ముందుంటారు.. నా అవసరాలు గుర్తిస్తారు... నా శ్రేయస్సు కోరుకుంటారు... అన్నింటికీ మించి నా కంటిలో  నలుసు పడితే మీ గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధ పడతారు... అంతగా ప్రేమిస్తారు మీరు నన్ను... ఈ ప్రేమ చాలదా అన్పిస్తుంది అమ్మా..!
  అమ్మా...! 'ఫలానా ప్రేమ లేకపోతే జీవితం లేదు' అని నాకిప్పుడనిపించడం లేదు... 'కామం అనేది జ్ఞానాన్ని పోగొట్టును'..., 'కామా తురాణాం న భయం న లజ్జ' అన్నట్టు మూర్ఖంగా ప్రవర్తించాను... యదార్థం ఇప్పుడర్థమయింది... ప్రేమ అందరి మధ్యనా అన్ని బంధాల్లోనూ  ఉంది.  చిన్న వ్యత్యాసం అంతే... ఆ మాత్రం దానికే... అందులో ఏదో ఒక ప్రేమ కోసం... అది కూడా ఎన్నాళ్ళు అదే స్థాయిలో ఉంటుందో తెలియని ఆకర్షణ కోసం నేను నా జీవితాన్ని, శీలాన్ని పోగొట్టుకోవడం తప్పనే అన్పిస్తుంది... అసలీ జీవితంలో మీలాంటి అమ్మ ...నాన్న.. అన్నా.. చెల్లెలు లేదా స్నేహితులలో... శ్రేయోభిలాషులలో... ఆత్మ బంధువులలో ఇంత మంది రూపంలో ప్రేమను పొందవచ్చు అని తెలిస్తే ఇకపై ఎవరూ నాలాంటి పిచ్చి పని చేయరని అన్పిస్తుంది. ప్రేమ పేరుతో మోసపోయి ప్రాణాలు తీసుకునే వారికి, ప్రేమ కోసం అంటూ ప్రాణాలు తీసేవారికి కూడా నీ లాంటి తల్లి కంట ఒలికే ఒక్క కన్నీటి చుక్క వెనుక ఉన్న ప్రేమ సాగరాన్ని చూసినా అసలు అలాంటి తప్పుడు ఆలోచనలు రావు. ఆత్మహత్యలూ... హత్యలూ...యాసిడ్‌ దాడులు...ఏవీ ఉండవనిపిస్తుందమ్మా! అలాగే ఈ సామాజిక రుగ్మతల్ని అరికట్టే ఓ కట్టుదిట్టమైన చట్టం ఖచ్చితంగా అమలు పరిస్తే నాలాంటి ఎందరినో కాపాడవచ్చనిపిస్తుందమ్మా...! అమ్మా..! నాకు దుఃఖం ఆగటం లేదు... చివరి సారిగా నాదో మనవి... క్రమం తప్పకుండా నా చెల్లెళ్లకు ఖుర్‌ఆన్‌లోని 'నూర్‌' సూరాను చదివి విన్పిస్తూ ఉండు... వారు ఇంటికి ఆలస్యంగా వచ్చినా... ఇంటి బైట ఎక్కువ సేపు గడిపినా... ఇంటర్నెట్‌ ముందు గంటల తరబడి కూర్చున్నా... వారి ప్రతి కదలికను గమనిస్తూ ఉండు... అమ్మా... నీ చీర కొంగు ఇప్పటికే తడిసి ముద్దయింది... నా కోసం దుఆ చెయ్యి... నన్ను  క్షమించమని అల్లాహ్‌ను వేడుకో... సారీ అమ్మా... నాన్నకు... చెల్లెళ్లకు... అన్నయ్యకు కూడా సారీ... మీరందరూ పెద్ద మనసుతో నన్ను  క్షమిస్తారన్న ఆశతో...!  ఇట్లు   - మీ కూతురు 

సంపంనపు బతుకులు సద్దన్నపు మెతుకులు



మానవ సమాజాభ్యుదయానికి 'శ్రమ' మూలాధారం. శ్రామిక శక్తితోనే మానవ సంస్కృతి వికసిస్తోంది. శ్రామిక వర్గ శ్రేయస్సు దేశ ఆయుష్షును పెంచే ఉషస్సు.  ఈ కారణంగానే 'మనిషి చేతి సంపాదనకన్నా మించిన సంపాదన లేద'న్నారు కార్మిక సోదరుని కాయలు కాసిన చేతిని ముద్దాడిన మానవ మహోపకారి ముహమ్మద్‌ (స). 
కార్మికులంటే శ్రమజీవులు.  శ్రామికుల శ్రమతోనే పరిశ్రమలు నడుస్తాయి. పరిశ్రమలు నడుస్తేనే పారిశ్రామికవేత్తలు ఉనికిలోకి వస్తారు. శ్రామికులు శ్రమించడం మానుకుంటే పరిశ్రమలు మూత బడతాయి. పారశ్రామిక వేత్తలూ దీవాలా తీస్తారు. కాబట్టి పారశ్రామికవేత్తలు శ్రామికుల శ్రమకు తగ్గట్టు వేతనం చెల్లించాలి. అప్పుడే  సర్వతోముఖ విశ్వ మానవ ప్రగతి సాధ్యమవుతుందని భావించగలం. 
''కూలివాని చెమట తడి అరక ముందే అతని కూలీ చెల్లించి  వేయండి'' అని బోధించారు శ్రామిక శ్రేయోభిలాషి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో పుట్టికొచ్చిన  ప్రత్యేక ఆర్థిక మండలి చట్టంతో నూరేళ్ళ క్రితం రూపొందించిన కార్మిక చట్టాలన్నీ మసకబారి పోయాయి. వెరసి కార్మికుల జీవన ప్రమాణాలు అడుగంటి పోయాయి. ఈ దుస్థితి పోవాలంటే శ్రామిక శ్రేయోభిలాషులయిన వారందరూ పూర్తి చిత్తశుద్ధితో సమాజంలో మార్పుకై పూనుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ మేరకు మానవత్వం కలిగిన ప్రతి ఒక్క స్పందిస్తారని ఆశిస్తున్నాము!