22, మార్చి 2014, శనివారం

మానవతామూర్తితో ముఖాముఖి


శాంతి ప్రియ

స్వాతంత్య్రం అంటే?

పట్టపగలు నిలువు దోపిడి చేసి
  అర్థ రాత్రిŠ స్వాతంత్య్రం ఇచ్చారు - తెల్లవాళ్ళు
  నిశి రాత్రి  స్వాతంత్య్రం పుచ్చుకుని
  నిషాలతో తూలుతున్నారు మనవాళ్ళు.

మంచి, చెడులంటే?

పుణ్యాత్ములు చచ్చి కూడా ప్రజల హృదాయాల్లో జీవిస్తారు
   పాపాత్ములు బ్రతికుండి కూడా జనం దృష్టిలో చస్తారు.

పేదవాడు?
బ్రతుకు దారి గోదారి, ఎటు చూసినా ఎడారి.

వివేకవంతుడు?

రేపటి కోసం ఈ రోజే సిద్ధంగా ఉండేవాడు
   ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయనివాడు.

మానవతావాది?

ప్రజావేదనల్ని పలుకరించినవాడు
   అన్నార్తుల ఆక్రందనల్ని
   అక్షరాలతో విన్పించినవాడు
   ప్రజా శ్రేయం కోసం ప్రాణాలిచ్చినవాడు
   నిజ ప్రభువు ఆదేశాల్ని శిరసావహించినవాడు.

పనికిమాలిన యువతరం?
 అమ్మా - నాన్నల ఆస్తులు తింటూ
   ఫ్యాషన్‌ జీన్స్‌లు వేసి
   బజార్లలో పచార్లు చేసి
   బస్‌ స్టాపుల్లో వేచి చూసి
   సుఖాల సఖులతో తిరుగుతూ
   క్లాసుకు రాక - పాసు కాక
   అధోగతి పాలవుతున్న యువకులు.

మనిషంటే?
స్పందించే హృదయం ఉన్నవాడే నిజమైన మనిషి-
మనసున్న మనిషి - నికార్సయిన మహా మనీషి!

మీ సూక్తి?
చీకూ చింతలతో చితికిపోవడం కన్నా చేతనైన మంచి చేసి చిరు దీపం వెలిగించడం మిన్న.

 మీ గీతం?
    సర్వమానవ సౌభ్రాతృత్వం నాగీతం
    కామాంధుల పాలిట కొరడా నాగీతం
   దుర్జనుల పాలిట సమర శంఖం నాగీతం
   సజ్జనుల పాలిట సమరస సంగీతం నాగీతం
   ఎదిగే సూర్యునికి సంకేతం నాగీతం
   ప్రగతి పథంలో పయనించే రథం నాగీతం.

 

కామెంట్‌లు లేవు: