23, మార్చి 2014, ఆదివారం

షైతాన్‌తో ఇంటర్‌వ్యూ



శాంతి ప్రియ

వలీద్‌: రోజురోజుకీ సమాజం బొత్తిగా పనికిరాకుండా పోతుంది.
షైతాన్‌: నువ్వో దేశోద్ధారకుడివి! నీదో సాత్విక ఆలోచననూ! వారి పాట్లు వాళ్లు పడతారు గాని, నీ సంగతి నీవు చూస్కో చాలు...

వలీద్‌: నువ్వు ఎన్నయినా చెప్పు... ఎలాగైనా సరే ప్రజల్ని ఈ గండం నుంచి గట్టెక్కించాల్సిందే. వారికి పనికొచ్చే హితవులు చేసి తీరాల్సిందే. హాఁ!
షైతాన్‌: అబ్బబ్బ...అబ్బబ్బ... ఏం దేశాభిమానం! ఏం ప్రజా శ్రేయం! కోరి మరి తలకొరివి పెట్టించుకుంటానంటే కాదనడానికి నేనెవడ్ని అంటా...

వలీద్‌: ప్రజల్ని ముప్పు నుండి రక్షించడం ప్రమాదం ఎలా అవుతుంది.? ఇది అందరికీ ప్రయోజనకరమైన కార్యం కదా!
షైతాన్‌: నంగనాచి తంగుబుర్రలా ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావే! నిజం చెప్పు... నీలో మాత్రం పదవి వ్యామోహం లేదూ? నలుగురూ నిన్ను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలన్న ఆశ లేదు? మరి ప్రదర్శనాబుద్ధి అన్నివిధాల ప్రమాదకరమే కదా! నువ్వెంత చేసినా చిత్తశుద్ధి లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే కదా నీ ప్రజాసేవ కార్యాలు. అలా చేస్తే ప్రభువు కూడా నిన్ను మెచ్చుకోడు కదా. మరి నరక కూపంలో నెట్టేస్తాడాయే!

వలీద్‌:  ఏందయ్యో నువ్వు! మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకేస్తున్నావ్‌?
నీ మాటలతో నా బుర్ర తినేస్తున్నావే. సరే నాక్కావాల్సిన కొందరు వ్యక్తుల సమాచారం అందిస్తావా?
షైతాన్‌: ప్రముఖుల గురించైనా, ప్రజల గురించైనా నువ్వడగాలే గాని ఇట్టే చెప్పెయ్యను!?

వలీద్‌: ఇమామ్‌ అహ్మద్‌, ఇమామ్‌ షాఫయీ, ఇమామ్‌ మాలిక్‌, ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) గురించి నీ ఒపీనియన్‌?
షైతాన్‌: నన్ను తలెత్తుకు తిరగకుండా చేసింది వీరే. ''ఖుర్‌ఆన్‌ మరియు హదీసులను గట్టిగా పట్టుకోండి'' అని ప్రజలకు చెప్పి నా నోట్లో మట్టి పోశారు. నా కొంప ముంచారోయ్‌.

వలీద్‌: ఫిర్‌ఔన్‌, నమ్రూద్‌, వలీద్‌ బిన్‌ ముగైరా గురించి నీ అభిప్రాయం?
షైతాన్‌: అలాంటి వారందరికీ నా మద్దతు సదా ఉంటుంది. నా సామ్రాజ్యాన్ని థ దిశల వ్యాపింపజేసింది ఈ వర్గమేనోయ్‌.

వలీద్‌:  ఖాలిద్‌ బిన్‌ వలీద్‌, సలాహుద్దీన్‌ అయ్యూబీ, ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వహ్హాబ్‌, ముహమ్మద్‌ బిన్‌ ఖాసిమ్‌?
షైతాన్‌: వాళ్ళంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. సలసల కాగే నూనె పెనములో వేయించాలి వీరందరిని.

వలీద్‌:  అబూ జహల్‌, అబూ లహబ్‌,సల్లాన్‌ రష్దీ, ఉమ్మె జమీల్‌, తస్లీమా నస్రీన్‌?
షైతాన్‌: మేమందరం ఒకే కుటుంబీకులం. మా అందరి లక్ష్యమూ ఒక్కటే. మానవుల్ని మార్గభ్రష్టుల్ని చేయడం. వీరందరూ మా వ్యవస్థకు వృద్ధీవికాసాలు ఇచ్చిన గొప్ప తత్వవేత్తలు...! ఆ మధ్య వీరిలో కొందరికి గొప్పగా సన్మానం కూడా జరిగింది తెలీదూ?

22, మార్చి 2014, శనివారం

మానవతామూర్తితో ముఖాముఖి


శాంతి ప్రియ

స్వాతంత్య్రం అంటే?

పట్టపగలు నిలువు దోపిడి చేసి
  అర్థ రాత్రిŠ స్వాతంత్య్రం ఇచ్చారు - తెల్లవాళ్ళు
  నిశి రాత్రి  స్వాతంత్య్రం పుచ్చుకుని
  నిషాలతో తూలుతున్నారు మనవాళ్ళు.

మంచి, చెడులంటే?

పుణ్యాత్ములు చచ్చి కూడా ప్రజల హృదాయాల్లో జీవిస్తారు
   పాపాత్ములు బ్రతికుండి కూడా జనం దృష్టిలో చస్తారు.

పేదవాడు?
బ్రతుకు దారి గోదారి, ఎటు చూసినా ఎడారి.

వివేకవంతుడు?

రేపటి కోసం ఈ రోజే సిద్ధంగా ఉండేవాడు
   ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయనివాడు.

మానవతావాది?

ప్రజావేదనల్ని పలుకరించినవాడు
   అన్నార్తుల ఆక్రందనల్ని
   అక్షరాలతో విన్పించినవాడు
   ప్రజా శ్రేయం కోసం ప్రాణాలిచ్చినవాడు
   నిజ ప్రభువు ఆదేశాల్ని శిరసావహించినవాడు.

పనికిమాలిన యువతరం?
 అమ్మా - నాన్నల ఆస్తులు తింటూ
   ఫ్యాషన్‌ జీన్స్‌లు వేసి
   బజార్లలో పచార్లు చేసి
   బస్‌ స్టాపుల్లో వేచి చూసి
   సుఖాల సఖులతో తిరుగుతూ
   క్లాసుకు రాక - పాసు కాక
   అధోగతి పాలవుతున్న యువకులు.

మనిషంటే?
స్పందించే హృదయం ఉన్నవాడే నిజమైన మనిషి-
మనసున్న మనిషి - నికార్సయిన మహా మనీషి!

మీ సూక్తి?
చీకూ చింతలతో చితికిపోవడం కన్నా చేతనైన మంచి చేసి చిరు దీపం వెలిగించడం మిన్న.

 మీ గీతం?
    సర్వమానవ సౌభ్రాతృత్వం నాగీతం
    కామాంధుల పాలిట కొరడా నాగీతం
   దుర్జనుల పాలిట సమర శంఖం నాగీతం
   సజ్జనుల పాలిట సమరస సంగీతం నాగీతం
   ఎదిగే సూర్యునికి సంకేతం నాగీతం
   ప్రగతి పథంలో పయనించే రథం నాగీతం.

 

ఓ భార్యగా నేను - ఓ భర్తగా నేను



ఓ భర్తగా నేను

- ఉమ్మె హసన్‌

స్వాగతం

  నేను మా శ్రీవారిని పూర్తి ఉత్సాహంతో ఘనంగా స్వాగతిస్తాను. వారు ఎప్పుడు ఎదురైనా నవ్వుతూనే పలకరిస్తాను. నేను వారి రాకకై పరితపిస్తున్నట్టు, ఎదురుచూస్తున్నట్టుగా వారికి అవగతమయ్యేలా ప్రయత్నిస్తాను.
 
వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు నేను చిరునవ్వుతో వారి అలసటను దూరం చేస్తాను.
 
ఇంట్లో ప్రవేశించాక దుస్తులు మార్చుకునేంతవరకు, ప్రశాంతంగా కూర్చునేంతవరకు నేను వారితోనే ఉంటాను.
 
నేను వారి ఆరోగ్యం గురించి అడుగుతాను. వారి దిన చర్యల గురించి ప్రశ్నిస్తాను.
 
వారికోసం నేను నీళ్ళగ్లాస్‌ అందజేస్తాను. పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా శరీరం నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడతాను.

బంధు మిత్రులు

   శ్రీవారి బంధువులు- అతిథుల  కోసం నేను మెచ్చేది కాక వారు ఇష్టపడే  వంటకాలని చేసి పెడతాను.
 
వారు విశ్రాంతి తీసుకునే గదులను నీటుగా ఉంచుతాను. నేను వారందరితో ప్రేమతో వాత్సల్యంతో మసలుకుంటాను.

భర్త కోపం

నేను వారి ముఖ్య కార్యాల్లో తలదూర్చను.ఏదైనా మాటనికాని లేక నా కోరికను గాని మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించను.

నేను వారిని చాలా మృదువుగా పలకరిస్తాను. నా మాట సరైనదైనా ఆ సమయంలో నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను మంచి సమయం చూసి వారికి చెప్పి ఒప్పిస్తాను.

వారు ఏదైనా మరచిన ఎడల నేను వారిని చాలా సున్నితమైన రీతిలో తెలియపరుస్తాను.

వారు రాజీపడిన తరువాతే నిద్రిస్తాను. వారికి ముందు నిద్రించను.

అప్పుడప్పుడు ప్రవక్త(స) గారి ఈ సద్వచనాన్ని వారి చెవిన వేస్తుంటాను. ''నీ భార్యే నీ స్వర్గం, నీ భార్యే నీ నరకం''.


ఓ భర్తగా నేను

- అబుల్‌ హసన్‌

 జీవితపు అన్ని ఘడియల్లో నేను ఆమెను సుఖ పెడతాను.
ఆమె లోపాలని పదేపదే ఎత్తి చూపను. దుస్తుల్లో వంటకాల్లో, మాటల్లో ఉన్న లోపాలను అప్పటికప్పుడు వేలెత్తి చూపను. మరొకరితోనూ చెప్పుకోను.

అప్పుడప్పుడు ఆమె కోసం స్త్రరితీశి కొని, దాచి - కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకున్న తరువాత ఇస్తాను.

ఆమె నాకు స్త్రరితీశి ఇచ్చినప్పుడు ఆమెను నేను ఎంతగానో మెచ్చుకుంటాను.

ఆమె నాతో ఏదైనా చెప్పదలిస్తే నేను ఆమెను ప్రోత్సహిస్తాను. నేను ఆమెకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆమె భావోద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటాను. పొలం విషయంలోనైనా, వంట విషయంలోనైనా గుడ్డలు కుట్టే కుట్టించే విషయంలోనైనా, అవసరమనిపిస్తే వెనకడుగు వెయ్యను. నా వల్ల కాదు, కూడదు అని సాకులు చెప్పను.

కొన్ని సందర్భాల్లో ఆమె పట్ల నా ప్రేమని ఎక్కువ ప్రదర్శిస్తాను. ముఖ్యంగా బహిష్టు సమయంలో, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవించినప్పుడు.

నేను ఆమెతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించను. ఆమె ఓ స్త్రీ అనీ, స్త్రీ గాజులాంటిదని సదా దృష్టిలో ఉంచుకుంటాను. ప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''వారు (స్త్రీలు) గాజుల్లా నాజుకైన వారు. వారితో మృదువుగా ప్రవర్తించండి''.

అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన వస్తువులు నాకు ఇష్టం లేకపోయినా తెచ్చిస్తాను.

నేను ఆమెను మంచి పేరుతో పిలుస్తాను. ప్రవక్త(స) మన అమ్మగారైన ఆయిషా(ర) ని ప్రేమతో 'ఆయిష్‌' అని పిలిచేవారు  కదా!

ఆమె నా కోసం శ్రమించినప్పుడల్లా, నేను ఆమెపై ప్రశంసావర్షం కురిపిస్తాను.

 నేను ఇంట్లో అడుగుపెట్టాక బయటి విషయం గురించి ఆలోచించను. నేను ఆమెకు తోడుగా ఉంటూ, రోజూ
 
అవసరమయిన వాటి గురించి చర్చిస్తాను. దీనీ ఇజ్తెమాలలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనమని ఆమెకు చెబుతూ ఉంటాను.

తస్మాత్‌ జాగ్రత్త!


 - అబుల్ హసన్

షైతాన్‌ నన్ను విచ్చలవిడిగా పాపాలకు పాల్పడేలా పురిగొల్పుతాడని నేను భయపడటం లేదు... కానీ పాపాన్ని విధేయతా ముసుగులో పెట్టి నన్ను మోసగి స్తాడేమోనని భయపడుతున్నాను...

కరుణ, జాలి, పరామర్శ అన్న గాలంతో వాడు నిన్ను ఓ స్త్రీ ఉచ్చులో బిగించవచ్చు...

ముందుచూపు అంటూ ఐహిక తళుకు బెళుకుల ఆకర్షణకు లోను చేసి నీలో ఐహిక లాలసను పెంచవచ్చు...

దుష్ట శిక్షణ అనే సాకుతో నిన్ను చెడు సావాసానికి ఉసి గొల్పవచ్చు.

దుర్మార్గుల సంస్కరణ నేపంతో నిన్ను కాపట్యరోగానికి గురిచేయవచ్చు.

ప్రత్యర్ధిపై పగసాధింపు చర్య ద్వారా మంచిని పెంచటం చెడుని నిర్మూలించడం నుండి నిన్ను దూరం చేయవచ్చు.

సత్యాన్ని సూటిగా చెప్పాలన్న ప్రేలాపనతో నిన్ను జమాఅత్‌ (సంఘం) నుండి వేరు చేయవచ్చు.  


నిన్ను నీవు సంస్కరించుకో, నీ లోపాల్ని సరిదిద్దుకో అన్న పిలుపుతో సమాజ సంస్కరణ నుండి నిన్ను తొలగించవచ్చు. విధివ్రాతను నమ్ముకుంటే చాలు అన్న వక్ర భాష్యంతో కర్తవ్యం నుండి నిన్ను దూరం చేయవచ్చు. సోమరిగా తయారు చేయవచ్చు.

ప్రార్థనలో లీనమై ఉండాలన్న నెపంతో విద్యావివేకాల సముపార్జన నుండి దూరం చేయవచ్చు.

'పుణ్యాత్ముల అనుసరణ ముఖ్యం' అన్న ప్రేరణతో నిన్ను ప్రవక్త (స) వారి సంప్రదాయాలకు దూరం చేయవచ్చు.

బాధితుల సానుభూతి అన్న నీతితో నీవు అఘాయిత్యాలకు పాల్పడేలా పురి గొల్పవచ్చు.

 షైతాన్‌ నీకు బహిరంగ శత్రువు. ఏ వేషంలో వచ్చినా అతన్ని నీ శత్రువుగానే ఎంచు. అంతేగాని ఏదో మేలు చేస్తాడు అనుకుంటే మాత్రం నీ తండ్రి ఆదం, తల్లి హవ్వాలు మోసపోయినట్లుగా నీవు మోసపోయే ప్రమాదం ఉంది సుమా!
   

పరీక్ష



- శాంతి ప్రియ

అలసి సొలసి ఒడ్డుకు చేరేవేళ ఆఖరి అడుగు
జారి సుడిగుండంలో కొట్టుకుపోతున్న దృశ్యం పరీక్షంటే...
ఎంత తనవారైనా అవసరానికొక్కరూ
పనికిరాలేదన్న నిస్సహాయ  క్షణం పరీక్షంటే...
ఒకానొక అమాయకపు ఉదయాన మోగే ఫోన్‌
ఉన్న ఫళాన బతుకుని బద్దలు చేసే భయంకర కబురు పరీక్షంటే...
ఆకాశానికికెగిసే అందమైన ఆశలు
అకస్మాత్తుగా కరుగుతున్న కలలై నేలకొరగటం పరీక్షంటే...
నిలువెత్తు శోకంపై శిలువైనాక  క్షణాల్ని
లెక్కిస్తూ బతకాల్సి రావటం పరీక్షంటే...
కళ్ళ ముందు కదిలే కనుపాపల్లా మెరిసే వాళ్ళు
కాగితాలపై అక్షరాలుగా మిగలటం పరీక్షంటే....
జనన పత్రాల్ని సరిచూసుకోవాల్సిన వేళ
మరణ పత్రాల మీద పేరుని మార్చలేకపోవటం పరీక్షంటే....
బతుకెలాగూ శాశ్వతం కాదని తెలుస్తున్నా అన్నదాతలు
ఆకలి దాహాల్తొ మరణాన్ని ఎదుర్కోవడం పరీక్షంటే...
ఈదడమంటూ నేర్చాక అంతులేని జీవన సాగరంలో
బ్రతుకు ఛిద్రమౌతున్నా ఈదుతూ ఉండాల్సిందే
అంతు చిక్కే వరకు పరమాత్మ ప్రసన్నత పొందేవరకు!

''భయం, ఆకలి, ధన ప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము. అలాంటి (క్లిష్ట) స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు 'ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్‌' అని పలికేవారికి వారి ప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (బఖర : 155-157)

చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం?


- అబూ అనస్‌

నేటి పేరెంట్స్‌ ప్రవర్తనపై నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. తమ సంతానం ఐహికంగా గొప్ప హోదాలను పొందాలని, ఆర్థికంగా బిల్‌గేట్స్‌ను మించిపోవాలనీ ఆశిస్తున్నారు. తప్పులేదు. కానీ తమ సంతానం నైతికంగా ఎదగాలనీ, ధార్మికంగా వృద్ధి చెందాలనీ, సత్కార్యాలలో పోటీపడాలనీ, స్వర్గ హోదాలను అధిరోహించాలనీ, జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌ను తమ సొంతం చేెసుకోవాలనీ, అక్కడ ప్రియ ప్రవక్త(స) వారి సహచర్యం పొందాలనీ, దైవ దర్శనంతో పునీతులవ్వాలనీ మాత్రం కోరుకోవడం లేదు. ఇది కడు శోచనీయం. ఐహికంగా, ఆర్ధికంగా సంతానం ఎంతగా ఎదిగినా పేరెంట్స్‌ కంటి చలువ కానేరదు. వారి ద్వారా మనశ్శాంతి లభిస్తుందని ఆశించనూ లేము. తమ సంతానం బాగుండాలనీ, వారు గొప్ప ప్రయోజకు లవ్వాలనీ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని మొక్కుకునే తల్లిదండ్రులకు తమ పిల్లల పరలోక సాఫల్యం, స్వర్గ ప్రాప్తి కొరకు దుఆ చేసే తీరిక ఎక్కడిది? అసలు తల్లిదండ్రుల కంటి చలువ పరలోక సాఫల్యం అన్న వాస్తవం ఎంత మంది పేరెంట్స్‌కి తెలుసని? పైగా మా పిల్లలు పాడైపోయారు ఒక్కడూ మా ముసలి బ్రతుకు గోడు పట్టించుకోవటం లేదు అని విచారించడం ఒకటి. అసలు మన సంతానాన్ని అలా పెంచింది ఎవరు? ఆనంద నిలయవు ఆ మల్లెల్ని మందారాల్ని ఫలాల్ని చెరపట్టింది ఎవరు? పేరెంట్స్‌ కారా? తల్లిదండ్రులు కారా?! అవును ఇందులో వారి ప్రమేయమే ఎక్కువగా ఉంది. దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ''పుట్టే ప్రతి శిశువు ప్రకృతి (సహజ) ధర్మంపైనే జన్మిస్తాడు. కాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదుడిగానో, క్రైస్తవునిగానో, మజూసిగా (అగ్ని ఆరాధకులు)నో మార్చివేస్తారు.
మంచి సంతానం కావాలని తాపత్రయపడేవారు భార్యను కలిసిన ప్రతి రాత్రి మొదట 'బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్‌నష్‌ షైతాన వ జన్నిబిష్‌ షైతాన మా రజఖ్‌తనా' (అల్లాహ్‌ా పేరుతో, ఓ అల్లాహ్‌ా మమ్మల్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ కీడు నుండి కాపాడు. నీవు ప్రసాదించే మా సంతానాన్ని కూడా షైతాన్‌ బారి నుండి కాపాడు). (బుఖారీ) అన్న దుఆ చదవాలని  తెలిసినా చదివేవారు ఎంత మంది? సంతానం కలిగాక షైతాన్‌ బారి నుండి వారి రక్షణ కోసం ''ఉయీజుకుమ్‌ బికలిమాతిల్లాహిత్తామ్మతి మిన్‌ కుల్లి షైతానివ్‌ వ హామ్మతిన్‌ వమిన్‌ కుల్లి ఐనిల్‌ లామ్మతి'' (నేను మిమ్మల్ని ప్రతి షైతాన్‌ మరియు విష జంతువుల బారి నుండి అన్ని రకాల చెడు దృష్టి నుండి అల్లాహ్‌ా సంపూర్ణ వచనాల రక్షణలో ఇస్తున్నాను.) అని చదివేవారు ఎందరు? ఏమిటి ఈ దుఆలదేముందంటారా? మీ దృష్టిలో ఈ ప్రార్థనల ప్రాముఖ్యత ఏమి లేదా?? అయితే దైవ ప్రవక్త(స) ఈ ప్రార్థలను తన అనుచరులకు ఎందుకు బోధించినట్టు? తాను స్వయంగా ఎందుకు చదివినట్టు? ఏమిటి, మన తల్లులు విశ్వాసుల మాతల కన్నా గొప్పవారా? మన సంతానం హసన్‌, హసైన్‌ల కన్నా ఉత్తములా?
నిజమైన దైవ దాసులు తమకు దేవుడు నేర్పించిన, దైవ ప్రవక్త(స) ప్రబోధించిన దుఆలను చదవడంతోపాటు ఖుర్‌ఆన్‌లోని ఈ దుఆను సైతం సదా చేస్తూ ఉంటారు. ''రబ్బనా హబ్‌లనా మిన్‌ అజ్‌వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్‌ వజ్‌అల్‌నా లిల్‌ ముత్తఖీన ఇమామా''.                              (సూరా ఫుర్ఖాన్‌ : 74)
(వారు దైవ సన్నిధిలో చేతులు జోడించి) ప్రభూ! మా భార్యా పిల్లల ద్వారా మాకు కంటి చలువ ప్రసాదించు. మేము దైవభీతిపరులకు నాయకులయ్యేలా చెయ్యి అని ప్రార్థిస్తారు.)
 ఈ దుఆకు భాష్యం చెబుతూ హసన్‌ బస్రీ (రహ్మ) ఇలా అన్నారు: దేవుడు దాసుడికి సంతానాన్ని ప్రసాదించడంతో పాటు వారి ద్వారా తల్లిదండ్రుల కంటి చలువను అనుగ్రహించడం అనేది గొప్ప వరం. నిజమైన విశ్వాసులు దైవాదేశాలకు కట్టుబడి జీవించే బిడ్డలను, మనవరాళ్ళను, బంధువుల్ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఈ విధంగా ఇహపరాల వారికి కంటి చలువ ప్రాప్తమవుతుంది. దీనికి ఇక్రమా (ర) వివరణ ఇస్తూ: ''ఈ దుఆ ముఖ్యోద్దేశం అందమైన శరీరాకృతి, సుందరమైన రూపకల్పన  గల సంతానం కాదు. దైవాదేశాలకు దైవప్రవక్త (స) వారి సంప్రదాయాలకు తలొగ్గించే సంతానం అన్నమాట'' అన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రవక్తలందరి పితామహులు అయిన ఇబ్రాహీమ్‌(అలై) దైవాన్ని ''రబ్బి హబ్‌లీ మినస్సాలిహీన్‌'' (ప్రభూ! నాకొక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు) అని ప్రార్థించారు. మేమతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు కలుగుతాడని శుభవార్త తెలిపాము (సాఫ్ఫాత్‌ 100,101)అన్నాడు అల్లాహ్‌.
ఈ ఆశయంతోనే ప్రవక్త జకరియ్యా 'రబ్బి హబ్‌లీ మిల్లదున్‌క జుర్రియతన్‌ తయ్యిబహ్‌ా. ఇన్నక సమీవుద్దుఆ' (ప్రభూ! నీ వద్ద నుండి నాకు ఉత్తమ సంతానం ప్రసాదించు. నిస్సందేహంగా నీవే నా మొరాలకించేవాడివి) అని వేడుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది?
 అతనలా ప్రార్థన గదిలో నిలబడి ప్రార్థన చేస్తుండగానే దైవదూతలు వచ్చి అతని పిలిచారు: ''ఓ జకరియ్యా! నిశ్చయంగా అల్లాహ్‌ా నీకు యహ్యా పుడతాడన్న శుభవార్త తెలియజేస్తున్నాడు. అతను అల్లాహ్‌ా నుండి వెలువడే ఒక వాణిని ధృవపరుస్తాడు. పైగా అతను నాయకత్వపు లక్షణాలతో భాసిల్లుతూ ఎంతో నిగ్రహ శక్తి గలవాడై ఉంటాడు. దైవ ప్రవక్త అవుతాడు; సజ్జనులలో పరిగణించబడతాడు'' అని చెప్పారు వారు. (ఆలి ఇమ్రాన్‌ : 39)
ఇదే తపనతో హజ్రత్‌ మర్యం (అలై) గారి తల్లి దైవాన్ని ఇలా వేడుకొంది: ''ఇన్నీ ఉయీజుహా బిక వ జుర్రియ్యతహా మినష్‌ షైతానిర్రజీమ్‌'' (నేనీ పాపకు మర్యం అని పేరు పెట్టాను) ఈమెను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారిన పడకుండా నీ రక్షణ లో ఇస్తున్నాను) అన్నది ఆమె. (ఆలి ఇమ్రాన్‌ 36)

 ఆ తర్వాత ఏం జరిగింది?

 ఆ తర్వాత ఆమె ప్రభువు ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి, చక్కగా పెంచి పోషించాడు. కొన్నాళ్ళకు జకరియ్యాను ఆమెకు సంరక్ష కునిగా నియమించాడు. జకరియ్యా ఆమె ప్రార్థన గదిలో ప్రవేశించి నప్పుడల్లా అక్కడ ఆహారపదార్ధాలు ప్రత్యక్షమై ఉండేవి. అది చూసి ''ఓ మర్యమ్‌! నీకీ ఆహారం ఎక్కడ్నుంచి వస్తోంది?''
 అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. దానికి ఆమె ''అల్లాహ్‌ దగ్గర్నుంచి వస్తోంది. నిశ్చయంగా అల్లాహ్‌ా తాను కోరిన వారికి ఇతోధికంగా ఆహారం ప్రసాదిస్తాడు'' అని సమాధానమిచ్చింది. (ఆలి ఇమ్రాన్‌ : 37)
చూశారా! ప్రవక్తలు, పుణ్య స్త్రీలు తమ సంతానం ఉత్తమమైన సంతానం కావాలని దీనాతిదీనంగా దైవాన్ని వేడుకుంటుంటే మనం చేస్తున్నదేమిటి? నాకు పుట్టబోయే బిడ్డ ఇంజనీర్‌ కావాలనీ, డాక్టర్‌ కావాలనీ, కలెక్టర్‌ కావాలనీ ఇంకా ఏదేదో అవ్వాలని కోరుకుంటున్నామే గానీ, ధర్మపరాయణుడు, నీతి నిజాయితీపరుడు, ఉత్తమ పౌరుడ,ు మంచి సంతానం కావాలని కోరుకోవటం లేదు. అందుకే మన సంతానం ఇలా తగలడింది. తల్లిదండ్రుల మీద దయలేదు వారికి, డిగ్రీలున్నాయి. వారు మనకే పుట్టారు. కానీ పుట్టి వారు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. పుట్టలోని చెదలు పుట్టి గిట్టినట్లే వారు సైతం -------- తల్లిదండ్రుల్ని నానా యాతనలకి, ఇబ్బందులకి గురిచేస్తున్నారు. కారణం కొంత వరకు మనమైతే, కొంత వరకు వారు కూడా.
సంతానం ఎవరికి ప్రియం కాదు? కానీ ఉత్తమ లక్షణాలు, గొప్ప గుణాలు గల సంతానం కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎందరున్నారు? సంతాన లేమి అయితే మంచి వైద్యుడ్ని సంప్రదిస్తాం, పంటలేమి అయితే సూచనలు అనుభవజ్ఞులను కలిసి తీసుకుంటాం.
మన ప్రయోజనాల కోసం ప్రాపంచిక విషయాలపై ఆధారపడే మనం ఎప్పుడైనా లోకకర్త సృష్టికర్త ముందు మన బాధల్ని చెప్పుకోవడానికి ప్రయత్నించామా? మీరు అడగండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు పదేపదే చెబుతుంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది మన పరిస్థితి.
''ఏమైంది మీకు? అల్లాహ్‌ ఔన్నత్యాన్ని నమ్మరెందుకు? ఆయనే కదా మిమ్మల్ని వివిధ ఘట్టాలలో రూపొందించినవాడు. ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలు సృష్టించాడు. అందులో చంద్రుడ్ని (చల్లటి వెన్నెల్ని వెదజల్లే) జ్యోతిలా చేశాడు. సూర్యుడ్ని దేదీప్యమానంగా (ప్రకాశించే) దీపంగా సృజించాడు. ఇదంతా మీకు కన్పించడం లేదా? (నూహ్‌ :13-16)


'దగాకోరు దేవుళ్ళ'ను ప్రజా జీవితాలనుండి ఏరివేయాలి


- శాంతి ప్రియ

 దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ''అతి త్వరలో ఓ కాలం రానున్నది. ఆ కాలంలో ఇస్లాం (ధర్మం) నామ మాత్రంగా ఉండి పోతుంది. ఖుర్‌ఆన్‌ (దైవ గ్రంథ) పఠనం ఒక ఆచారంగా మిగిలి పోతుంది. ప్రజల ప్రార్థనా మందిరాలు (రకరకాల అలంకరణలతో) కళకళ లాడుతుంటాయి. కానీ సన్మార్గం, హితబోధల రీత్యా నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉంటాయి. అప్పటి వారి ధర్మవేత్తలు ఆకాశం క్రింద (లోకంలో) ఉండేవారందరిలోకెల్లా అతి నికృష్టు లవుతారు. వారి వల్ల ఉపద్రవాలు (సంక్షోభాల, సమస్యల సుడిగుండాలు) జనిస్తాయి. తరువాత అవి వారిని సైతం చుట్టుముడుతాయి.'' (బైహఖీ)
 
భేషజాలను పక్కనపెట్టి నిర్మొహమాటంగా వాస్తవ దృక్పథంతో నిజాన్ని అంగీకరించే ప్రయత్నం చేస్తే ఈ వ్యాసంలోని వాస్తవాలు అన్ని వర్గాలవారిలోనూ కనిపిస్తాయి. ఇందులో ప్రతి విషయం నిజంగా జరిగినదే, జరుగుతున్నదే. మతం పేరుతో, దేవుడి పేరుతో దగా మోసాన్ని ఎండగట్టడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.  
                                                                   
  'మతం అంటే మత్తు మందు' మత గురువులంటే 'వంచకులు' అనే భావజాలం ప్రబలుతున్న దినాలివి. ఇటువంటి పరిస్థితిలో నిజానిజాలను బైట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన మతధర్మం అంటే మానవత్వమని, దోపిడి చేసేది, ధనార్జన లక్ష్యంతో సాగేది, జన వంచనతో వృద్ధి చెందాలనుకునేది అసలు మతం కాదని, అదో ఉన్మాదం, ఉపద్రవం, పచ్చి మోసమని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అవును మతధర్మం జనోద్ధరణ కోసమేగానీ ధనార్జన కోసం ఎంతమాత్రం కాదు. దైవ ప్రవక్తలందరూ వచ్చింది మానవ కళ్యాణం, లోక శాంతి కోసమే. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). అనేక విధాల హెచ్చతగ్గులున్న, అసమానతలున్న, అస్పృశ్య తలున్న సమాజాన్ని అన్ని విధాల సంస్కరించి
అందరినీ ఒకటిగా చేసి శాంతి- సౌభ్రాతృత్వాలు-సమానత్వం స్థాపించడానికే మహా ప్రవక్త (స) వచ్చారన్నది ఆయన చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహా ప్రవక్త (స) వారు మొదట నుండీ పీడిత జనాల పక్షం వహించారు. ఆయన దళిత జనాల కోసమే వచ్చారు. 'సాటి మనిషి అవసరాన్ని మీరు తీర్చండి. దేవుడి మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడు' అన్నారు.  'మంచిని బోధించేవాడు  స్వయంగా మంచి చేసినవాడితో సమానం' అన్నారు. 'ప్రజల సొమ్ముల్ని అన్యాయంగా దోచుకు తినేవారు తమ కడుపుల్ని నరకాగ్నితో నింపుకుంటున్నారు' అని హెచ్చరించారు.
  అయితే నేడు మన సమాజంలో మతం పేరుతో ప్రబలుతున్న వికృత చేష్టలను చూసినవారికి సహజంగానే విసుగు, చిరాకు కలుగుతుంది. సంఘ శ్రేయోభిలాషులు, శాంతి కాముకులు ఆశించిన సమాజం ఇదేనా? అంటే 'కాదు' అనేది నిజాయితీతో కూడిన సమాధానం. ఏళ్ళ తరబడి అంతర్మథనం చెందిన ఓ సోదరుడు తన గాధను ఇలా చెప్పుకు వచ్చాడు-  
 
   కొందరు మంచి ధార్మిక అవగాహన గల విద్యార్థుల సహచర్యం వల్ల క్రమేణా నిజానిజాలను తెలుసుకోగలిగాను. ఆ మధ్యనే డా.అంబేద్కర్‌ గారి మాటలు నా కంట పడ్డాయి. ''వేలాది మంది ముస్లింలు పీర్ల దగ్గరకు వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు. వాస్తవానికి కొన్ని చోట్ల ముస్లిం పీరుకు వంశపారంపర్యంగా పౌరోహిత్యం చేస్తూ పీరు దుస్తులు ధరిస్తున్న బ్రహ్మణులున్నారు. ఇక గుజరాత్‌, పంజాబ్‌ విషయానికొస్తే - లగకణులు రాజపుత్ర, జాట్‌, బనియాల సంతతికి చెందినవారు ఒకరినొకరు నమస్కారం చేసుకునేటప్పుడు 'రాం రాం' అనే అంటారు. మసీదుకు తరచుగా వెళ్తుంటారు. 'సుంతీ' చేయించుకుంటారు. శవాలను ఖననం చేస్తారు. అటువంటిదే మరో వర్గం - 'మోమన్లు' సుంతీ పాటిస్తారు. శవాలను ఖననం చేస్తారు. గుజరాతీ భాషలో చదువుతారు. కాని ఇతర అన్ని సందర్భాల్లో భారతీయ విగ్రహారాధకుల్లానే ప్రవర్తిస్తారు''.
  ఈ పంక్తులు చదివాక ఇస్లామీయ చరిత్రను, ఖుర్‌ఆన్‌ మరియు హదీసులను క్షుణ్ణంగా  తెలుసుకోవాలన్న తపన నాలో మొదలయ్యింది. అలా నా సత్యాన్వేషణ ప్రారంభమయింది. తరువాత చరిత్రతో పాటు ఖుర్‌ఆన్‌, హదీసులను చదివి క్రమంగా మారుతూ, నన్ను నేను ప్రశ్నించుకుంటూ నిజమైన ముస్లింని అయ్యాను.
 
  ''పుట్టే బిడ్డ ఎవరి ఇంట్లో పుట్టినా - తను మాత్రం ప్రకృతి ధర్మంపైన్నే పుడుతుంది' అన్నది జగమెరిగిన సత్యం. జగత్ప్రవక్త చెప్పిన సత్యం. అయితే పిల్లవాడు పుట్టాక వారికిష్టమొచ్చిన మార్గంలోకి మార్చుకుంటారు. ఈ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా తెలుకున్న నేను చాలా తొందరగానే వాటన్నింటికీ స్వస్తి పలికాను. అల్‌హమ్దులిల్లాహ్‌! ఇప్పుడు నాలో ఎలాంటి అపచారాలు, మూఢ విశ్వాసాలు లేవు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందన్న  భయంతోనే దైవ ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ''నా సమాధిని జాతర స్థలంగా, సంబరాల కేంద్రంగా చేయకండి''. (అబూ దావూద్‌)

 (సోదరులారా! ప్రవక్తలందరి నాయకులైన అంతిమ ప్రవక్త (స) వారి సమాధినే జాతర స్థలంగా, ఉత్సవ స్థలిగా చేసుకోవడం తప్పయినప్పుడు ధార్మిక వ్యక్తుల సమాధుల్ని ప్రదక్షిణా కేంద్రంగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం? ''ప్రవక్తల సమాధుల్ని సజ్దా నిలయాలుగా చేసుకున్నందుకు దేవుడు వారిని శపించాడు'' అని ప్రవక్త (స) అంటుంటే మనం పుణ్యాత్ముల సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అవివేకం! అర్థ రహితం!! విడ్డూరం!!! ప్రవక్తల్ని పూజించినందుకు వారు నరకవాసులైతే పుణ్యాత్ముల్ని దైవ భాగస్వాములుగా నిలుపుతున్న మనం నేరుగా స్వర్గానికి చేరుకుంటామా? మీరే ఆలోచించండి! మానవ చరిత్రను పరిశీలిస్తే మానవుడు ప్రకృతి వైపరీత్యాలకు భయపడి, అవగాహన లేమి, అజ్ఞానంతో ప్రకృతిలోని అనేకానేక వస్తువులను దైవంగా భావించి పూజించినట్లు గ్రహిస్తాం. ఉదాహరణకు: అగ్ని, వాయువు, వాన, సూర్యచంద్ర నక్షత్రాలు, పాములు.... మొదలైనవాటిని పూర్వం నుండి ప్రపంచపు అన్నీ ప్రాంతాల్లోనూ  మనిషి పూజిస్తూ వస్తున్నాడు. వీటిలో ఏ ఒక్కటీ దైవం కాజాలదన్న విషయం ఆలోచనా శక్తిగల ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.  కాబట్టి శక్తివంతుడైన మనిషి శక్తిహీనమైన, కదలిక లేని జడపదార్థాల  ముందు తలవంచడం స్వయంగా అతనికే అవమానకరం! ఇది అన్ని విధాల మూర్ఖత్వం, అవివేకమే అవుతుంది.

ఒక హైందవ వ్యక్తి బాధతో చెప్పుకున్న ఉదంతం ఇది:
నా బాల్యంలో  జరిగిన సంఘటన. ఒక్కసారి నిద్రలేస్తూ పిల్లి ముఖం చూశాను. మా అమ్మ అది అశుభమని చెప్పి, మళ్ళీ ఇంకోసారి పడుకుని లేవమంది. మా అమ్మ దృష్టిలో - ఆదివారం అమావాస్య, కాకి, పిల్లి, తుమ్ము, తలంటుకున్నరోజు ఊరు దాటడం,
వితంతువు ఎదురు రావడం - ఇవన్నీ అపశకునాలు, అశుభాలు. కాకపోతే వితంతువు అయిన నా సొంత చెల్లెలు ముఖం చాలా సార్లు చూడవలసివచ్చేది. ఎదిరించి అడుగుదాం అంటే - అపచారం అని నా నోరు నొక్కేసేది మా అమ్మ. ఆ తర్వాత బాగా పరిశీలించాక తెలిసింది - ఇవన్నీ వట్టి బూటకాలని.
  అలాగే నా చిన్నప్పుడు మా ఊరికి ఓ దగాకోరు దేవుడొచ్చాడు. కుతూహలంతో అతనితో కలిసి ఊరంతా తిరిగాను. అతను అర చేతులు చూసి జాతకం చెప్పేవాడు. అతను చెప్పేది నేను చాలా జాగ్రత్తగా వినేవాడిని. అతను అందరికి ఒకేలాగున చెప్పేవాడు. ముందు మంచిగా చెప్పి, తర్వాత ఏదో ఒక దోషం అంటగట్టేవాడు. ఏ దోషమూ తోచనప్పుడు 'వాస్తు దోషం' వారి మీద బలవంతాన రుద్దేవాడు. జనం భయపడి ఆ దోషం పోవడానికి అతని దగ్గర విభూది, వేరు ముక్కలు కొనుక్కునేవారు. అప్పట్లో ఆ దగాకోరు దేవుడు బాగానే డబ్బు లాగాడు. ముఖ్యంగా స్త్రీల నుండి. ఆ తర్వాత నేను ఎదిగినకొద్దీ ఇవన్నీ కూటి కొరకు నేర్చుకున్న విద్యల్లో ఒకటని గ్రహించాను.

అప్పటి నుండి ఈ దగాకోరు దేవుళ్ళ మీద పూర్తిగా నమ్మకం పోయింది. 'స్వామి ధర్మ తీర్థ' మాటల్లో చెప్పాలంటే - దేవాలయాలు మనం
ఎట్లా రూపొందిస్తే అట్లా తయారవుతాయి. అవిగాని, వాటిలోని శిలాప్రతిమలుగాని వాటంతట అవి మంచీ చేయలేవు. చెడూ చేయలేవు. మనం బుద్ధీహీనులమైతే పూజారులు దేవాలయాల్ని ఉపయోగించుకుని విగ్రహా రాధనని ప్రోత్సహించి మూడ విశ్వాసాలని పెంచి పోషిస్తారు. అమాయక జనాన్ని దోపిడీ చేస్తారు. మనం తెలివైన వారిమైతే దేవాలయాలను ఉపయోగించి ప్రజల జీవితాలను తీర్చిదిద్దవచ్చు. కులం విభేదాలను రూపుమాపవచ్చు. వాళ్ళను సమైక్యపర్చవచ్చు.అందుకు దేవాలయాలను ప్రజల విద్యను  బోధించే ఆరామాలుగా మార్చి ప్రజల పురోభివృద్ధి, పౌరోభివృద్ధి కోసం ఉపయో గించాలి.
  భారత దేశానికి కులం, అస్పృశ్యతల బదులు సహోదరత్వం అపూర్వ సమానత్వం కావాలి. ప్రజలందరి మధ్య ఐక్యత కావాలి. 33 కోట్ల మంది దేవుళ్ళు, 54 కోట్ల మంది భగవానులు, దెయ్యాలు వారి భార్యలు, వారికి పెట్టే విభిన్న నైవేద్యాల సమాజం పోయి ఒకే శాస్త్రీయమైన (అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ సులభంగా ఆచరించదగిన) ఆలోచన కావాలి.    
                (హిందూ సామ్రాజ్యవాద చరిత్ర)
  ఇంకో వ్యక్తి ఇలా అంటారు- నేను క్రైస్తవ సమాజంలో పెరిగిన వాడిని. బాల్యంలో మా చిట్టి బుర్రలకు అర్థం కానీ అనేకానేక ప్రశ్నలుండేవి. ప్రశ్నించేందుకు ప్రయత్నించి  నప్పుడల్లా 'బైబిల్‌ని ప్రశ్నించినవాడు సాతాను శోధకుడు' అని మా నోర్లు మూసేసేవారు.    
  అలాగే 'ఇది ఏసు రక్తం, ఇది ఏసు మాంసం'
అంటూ తినిపించే సజ్జ రొట్టెలు త్రాగించే పానకం మాకు మింగుడు పడేవి కావు. రక్తం...! మాంసం....!! అందులోనూ ఆ ప్రేమమూర్తి రక్తం...! ఆ దయాస్వరూపుడి మాంసం...!! మనం తినడమేమిటి అనే ప్రశ్న మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. ఇలాంటి  ఎన్నో   ప్రశ్నలు ఉబికివచ్చినా 'ఫాదర్‌' ఎక్కడ
'సాతాను శోధకుడు' అని నామకరణం చేస్తాడోనని అడిగే ధైర్యం, తెగింపు లేకపోయేవి. చివరికి నా దృష్టి యేసువారి ఈ వాక్యాలపై పడింది. ఆయన ఇలా అన్నారు:
  శాస్త్రుల గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగీలు ''ధరించుకొని తిరుగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములలో అగ్ర పీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా ధీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి మరి విశేషముగా శిక్ష  
పొందుదురు''. (లూకా-25:45-47)
  ఇలా ధర్మాన్ని ధనార్జన మార్గంగా మార్చుకున్నవారు ఏ వర్గానికి చెందిన వారైనా వారు చట్టం రీత్యా శిక్షార్హులు. 'చట్ట తన పని తాను చేసుకుపోతుంది' అన్నది ఎంత వరకు నిజమో గానీ మనం మాత్రం సభ్య సమాజ పౌరులుగా చేయగలిగింది చెయ్యాలి. లేకపోతే ఆ పరమ దాత రేపు మనల్ని నిలదీ స్తాడు.

  మహా ప్రవక్త (స) వారు ప్రభవింపజేయడానికి కారణం కూడా ఇదే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ''ఉమ్మీ ప్రవక్త ప్రస్తావన వారి దగ్గరున్న తౌరాత్‌ సువార్త గ్రంథాలలో కూడా ఉంది. అతను మంచి పనులు చేయమని (ప్రజలను) ఆదేశిస్తాడు. (వారిని) చెడుల నుండి వారిస్తాడు. వారి కోసం పరిశుద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేస్తాడు. అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు. వారి మీద పడిన (లేనిపోని ఆంక్షల) భారాన్ని తొలగిస్తాడు. వారు చిక్కుకున్న (దురాచార) బంధనాల నుండి వారికి విముక్తి కలిగిస్తాడు. కనుక ఎవరైతే అతడ్ని విశ్వసించి సమర్ధించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్ధక జీవులు. వారినే విజయం వరిస్తుంది''.  (ఆరాఫ్‌; 157)

షైతాన్‌తో ముఖాముఖి


- శాంతి పియ్ర

ప్రశ్న:  నీ పేరు?
జ:    అజాజీల్‌

ప్రశ్న:  నీ బిరుదు?
జ:     ఇబ్లీస్‌ - షైతాన్‌ - మర్‌దూద్‌

ప్రశ్న:  ఇంతకీ నీకీ బిరుదులు ఎందుకు లభించినట్టో?
జ:      దైవాజ్ఞను అతిక్రమించినందుకు 'షైతాన్‌', ఆది
         మానవుణ్ని 'నేను నీ శ్రేయోభిలాషిని' అని చెప్పి
         మోసగించినందుకు 'ఇబ్లీసు', దైవ సన్నిధి నుండి
         వెలి వేయబడినందుకు మర్‌దూద్‌.

ప్రశ్న:   నీ హాబీలు?
జ:      మనుషుల్ని మోసపుచ్చి సన్మార్గం నుండి
        తొలగించడం, మంచిని తుంచడం, చెడును
        పెంచడం. అశాంతి అలజడులను సృష్టించడం,
        తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని , పిల్లల నుంచి
        తల్లిదండ్రుల్ని దూరం చేయడం. భార్యాభర్తల
        మధ్య   చిచ్చుపెట్టి పచ్చని కాపురాల్లో నిప్పులు
        పోయడం. ప్రజల్ని చెడు కార్యాలకై
        పురిగొల్పడం, దైవాదేశాల్ని, హద్దుల్ని
        అతిక్రమించేందుకు ఉసిగొల్పడం. స్వర్గానికి
        దూరం చేయడం. నరకానికి దగ్గర చేయడం.
        యువతను పోరంబోకుల్లా తయారు చేయడం.
        ఇహమే సర్వం, పరమే లేదు అని
        నమ్మ బలకడం...ఇలా చెప్పుకుంటూ పోతే
        ఇంకా చాలా ఉన్నాయిలెండి.

ప్రశ్న:   నీ లక్ష ్యం ? 
జ:      ధర్మపరాయణుల భ్రష్టు కొరకు
          పాపిష్టుల ప్రగతి కొరకు
          దుర్మార్గుల వృద్ధి కొరకు
          దుర్గుణాల పెరుగుదల కొరకు
          రాత్రింబవళ్ళు ప్రయత్నించటం.