22, మార్చి 2014, శనివారం

తస్మాత్‌ జాగ్రత్త!


 - అబుల్ హసన్

షైతాన్‌ నన్ను విచ్చలవిడిగా పాపాలకు పాల్పడేలా పురిగొల్పుతాడని నేను భయపడటం లేదు... కానీ పాపాన్ని విధేయతా ముసుగులో పెట్టి నన్ను మోసగి స్తాడేమోనని భయపడుతున్నాను...

కరుణ, జాలి, పరామర్శ అన్న గాలంతో వాడు నిన్ను ఓ స్త్రీ ఉచ్చులో బిగించవచ్చు...

ముందుచూపు అంటూ ఐహిక తళుకు బెళుకుల ఆకర్షణకు లోను చేసి నీలో ఐహిక లాలసను పెంచవచ్చు...

దుష్ట శిక్షణ అనే సాకుతో నిన్ను చెడు సావాసానికి ఉసి గొల్పవచ్చు.

దుర్మార్గుల సంస్కరణ నేపంతో నిన్ను కాపట్యరోగానికి గురిచేయవచ్చు.

ప్రత్యర్ధిపై పగసాధింపు చర్య ద్వారా మంచిని పెంచటం చెడుని నిర్మూలించడం నుండి నిన్ను దూరం చేయవచ్చు.

సత్యాన్ని సూటిగా చెప్పాలన్న ప్రేలాపనతో నిన్ను జమాఅత్‌ (సంఘం) నుండి వేరు చేయవచ్చు.  


నిన్ను నీవు సంస్కరించుకో, నీ లోపాల్ని సరిదిద్దుకో అన్న పిలుపుతో సమాజ సంస్కరణ నుండి నిన్ను తొలగించవచ్చు. విధివ్రాతను నమ్ముకుంటే చాలు అన్న వక్ర భాష్యంతో కర్తవ్యం నుండి నిన్ను దూరం చేయవచ్చు. సోమరిగా తయారు చేయవచ్చు.

ప్రార్థనలో లీనమై ఉండాలన్న నెపంతో విద్యావివేకాల సముపార్జన నుండి దూరం చేయవచ్చు.

'పుణ్యాత్ముల అనుసరణ ముఖ్యం' అన్న ప్రేరణతో నిన్ను ప్రవక్త (స) వారి సంప్రదాయాలకు దూరం చేయవచ్చు.

బాధితుల సానుభూతి అన్న నీతితో నీవు అఘాయిత్యాలకు పాల్పడేలా పురి గొల్పవచ్చు.

 షైతాన్‌ నీకు బహిరంగ శత్రువు. ఏ వేషంలో వచ్చినా అతన్ని నీ శత్రువుగానే ఎంచు. అంతేగాని ఏదో మేలు చేస్తాడు అనుకుంటే మాత్రం నీ తండ్రి ఆదం, తల్లి హవ్వాలు మోసపోయినట్లుగా నీవు మోసపోయే ప్రమాదం ఉంది సుమా!
   

కామెంట్‌లు లేవు: