22, మార్చి 2014, శనివారం

పరీక్ష



- శాంతి ప్రియ

అలసి సొలసి ఒడ్డుకు చేరేవేళ ఆఖరి అడుగు
జారి సుడిగుండంలో కొట్టుకుపోతున్న దృశ్యం పరీక్షంటే...
ఎంత తనవారైనా అవసరానికొక్కరూ
పనికిరాలేదన్న నిస్సహాయ  క్షణం పరీక్షంటే...
ఒకానొక అమాయకపు ఉదయాన మోగే ఫోన్‌
ఉన్న ఫళాన బతుకుని బద్దలు చేసే భయంకర కబురు పరీక్షంటే...
ఆకాశానికికెగిసే అందమైన ఆశలు
అకస్మాత్తుగా కరుగుతున్న కలలై నేలకొరగటం పరీక్షంటే...
నిలువెత్తు శోకంపై శిలువైనాక  క్షణాల్ని
లెక్కిస్తూ బతకాల్సి రావటం పరీక్షంటే...
కళ్ళ ముందు కదిలే కనుపాపల్లా మెరిసే వాళ్ళు
కాగితాలపై అక్షరాలుగా మిగలటం పరీక్షంటే....
జనన పత్రాల్ని సరిచూసుకోవాల్సిన వేళ
మరణ పత్రాల మీద పేరుని మార్చలేకపోవటం పరీక్షంటే....
బతుకెలాగూ శాశ్వతం కాదని తెలుస్తున్నా అన్నదాతలు
ఆకలి దాహాల్తొ మరణాన్ని ఎదుర్కోవడం పరీక్షంటే...
ఈదడమంటూ నేర్చాక అంతులేని జీవన సాగరంలో
బ్రతుకు ఛిద్రమౌతున్నా ఈదుతూ ఉండాల్సిందే
అంతు చిక్కే వరకు పరమాత్మ ప్రసన్నత పొందేవరకు!

''భయం, ఆకలి, ధన ప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము. అలాంటి (క్లిష్ట) స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు 'ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్‌' అని పలికేవారికి వారి ప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (బఖర : 155-157)

కామెంట్‌లు లేవు: