3, జనవరి 2013, గురువారం

వికసించే ఈ లేత మొగ్గలను కాపాడుకోండి
ప్రవాసాంధ్ర సోదరులారా!



దేవుడు మిమ్మల్ని విదేశాల-కు చేర్చాడు. జీవనోపాధిని సమకూర్చాడు. మీరు మీ కాళ్ళపై నిలబడగలిగారు. ఓ ఇంటి వారయ్యారు. దేవుడు మీకు పండంటి బిడ్డలను కూడా ప్రసాదించాడు. అక్కడ మీ ఇల్లు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే ఇక్కడ మీరు వారి గురించి నలుగురితో చెప్పుకుని, వారి ఫోటోలు చూపించుకుని ఆనందిస్తున్నారు. నిజంగా ఈ ఆనందం వెలకట్టలేనిది. సదా మీ ఇల్లు ఇలాగే కళకళ లాడాలన్నది, మీ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలన్నది మా ఆకాంక్ష.

అయితే మీరు పెంచే పూవనంలోని ముసిముసి నవ్వుల పాలబుగ్గలు, వికసించే లేత మొగ్గలు మున్ముందు మీకు కన్నుల పండుగ కావాలంటే, మీ చల్లని లోగిలిలో ఆనందం నిండాలంటే, అనురాగం పండాలంటే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికెలాంటి తెగులు పట్టకుండా, కాలుష్యం కాటేయకుండా కాపాడుకోవాలి. అంటే పసితనం నుండే ధార్మికంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలి. సంస్కారం నేర్పాలి. కుటుంబ విలువలను, నైతిక విలువలను నూరిపోయాలి. స్కూలు చదువుతోపాటు, దీని తాలీమ్‌ కూడా ఇవ్వాలి. మీ మీ పేటలలోని మస్జిద్‌లలో జరిగే ఖుర్‌ఆన్‌ బోధనా తరగతులకు వారిని పంపుతూ ఉండాలి. ముఖ్యంగా వేసవి సెలవులలో వారి సమయం వృధా కానివ్వ కుండా - స్థానిక దీనీ సంస్థలు కండక్ట్‌ చేసే శిక్షణా క్లాసులకు మీ పిల్లల్ని పంపించాలి. వీటన్నింటితో పాటు పిల్లల హోంవర్క్‌ను, వారి దిన చర్యలను శ్రద్ధగా వాచ్‌ చేస్తూ ఉండాలి.
తండ్రులు తమ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత తల్లులపై అధికంగా ఉంటుంది. అయినాసరే అడుగడుగునా తండ్రుల గైడెన్స్‌ అవసరం. కాబట్టి మీరు తరచూ ఇంటికి ఫోన్‌ చేసి పిల్లల చదువు సంధ్యల గురించి ఆరాతీయటంతో పాటు, వారు నమాజు చేస్తున్నారో లేదో నిలదీసి అడగాలి. మస్జిద్‌కు వెళ్ళి మరీ నమాజు చేస్తున్నారా లేదా అని మగపిల్లల్ని అడగాలి. అమ్మ మాట వినాలని పిల్లలకు తాకీదు చేస్తూం డాలి. అలాగే - ''మన పిల్లలే మన అసలు ఆస్తి'' అని భార్యకు పదే పదే నొక్కి చెబుతుండాలి.
బ్రతుకు తెరువుకోసం విదేశాలకు వెళ్ళిన చాలా మంది సోదరులు ఆర్థికంగానైతే బాగానే ఉంటారుగాని పిల్లల శిక్షణలో మాత్రం వెనుకంజ వేస్తారు. తత్కారణంగా వారి పిల్లలు నైతికంగా దెబ్బతింటారు. వారిలో విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ఇంట్లో డబ్బు ఉంటుంది. అడగంగానే కోరిక తీర్చే అమ్మ ఉంటుంది. టెన్త్‌ పూర్తి కాక ముందే చేతిలో మొబైల్‌ ఫోన్‌, మోటర్‌ బైక్‌ వచ్చేస్తుంది. దాంతో పిల్లల ఊహలకు రెక్క లొచ్చేస్తాయి.

ప్రవాసాంధ్ర సోదరా!
మీరు గనక శ్రద్ధ వహిస్తే, అక్కడ మీ ఇల్లాలు కూడా మీ పిల్లల్ని అదుపులో ఉంచి, సంస్కారవంతుల్ని చేయగల్గుతుంది. వర్తకం నిమిత్తం దూర దేశాలకు వెళ్ళే ఎంతో మంది పురుషుల ధర్మపత్నులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వగలిగారని చరిత్ర చెబుతోంది. హజ్రత్‌ సుఫియాన్‌ సౌరీ (రహ్మ) గారి తల్లినే చూడండి, పేదరికంలో మ్రగ్గుతూ కూడా దూది ఏకి తన కొడుకుని చదివించారామె. పైగా ఆమె తన పిల్లాడికి తరచూ చెబుతుండేది - ''నాయనా! నువ్వు ఎప్పుడు పది వాక్యాలు నేర్చుకున్నా, వాటి ద్వారా నీ భక్తిలో, సభ్యతా సంస్కార్లాల్లో, వినయ వినమ్రతలలో ఏపాటి ఎదుగుదల వచ్చిందో బేరీజు వేసుకో. ఒకవేళ ఎదుగుదల లేకపోతే ఈ చదువు వల్ల నీకు కలిగింది కీడేగాని, మేలు కాదు అని గుర్తుం చుకో''.
ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) గారి గురువు అయిన రబీఅతుర్రాయ్‌ (రహ్మ) ఉదాహరణను తీసుకోండి - ఈయన పసివాడుగా ఉన్నప్పుడు తండ్రి 30 వేల దీనార్లు ఇల్లాలికి ఇచ్చి, ఒక ముఖ్యమైన పనిపై విదేశానికి వెళ్ళిపోయారు. బాధ్యత గల ఆ ఇల్లాలు ఆ డబ్బంతా ఆ అబ్బాయి చదువు కోసం వెచ్చించి అతన్ని ఆ కాలపు సాటిలేని మేటి విద్వాంసునిగా తీర్చి దిద్దింది. సుదీర్ఘకాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి, తన కుమారుని పాండిత్యాన్ని చూసి ఆనందంతో పరవశించిపోతాడు.
పసిపిల్లలు ప్లెయిన్‌ పేపర్‌ లాంటివారు. దానిపై ఏది గీస్తే అదే ముద్రపడుతుంది. ''మొక్కై వంగనిది మ్రానై వంగునా!?'' అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చుకోండి. లేత వయసులో మనం మన పిల్లల్ని ఎలా మలచుకుంటే అలాగే తయారవుతారు. కాబట్టి తల్లి దండ్రులు తమ పిల్లల మంచి శిక్షణకై జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు వారు స్వయంగా పిల్లలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. విదేశాల్లో ఉండే తండ్రులు వీలైనంత త్వరగా సెలవుపై వెళుతుండాలి. సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆలుబిడ్డలతో గడపాలి.
(1) ఇంట్లో చిన్నతనం నుంచే పిల్లలకు 'సలాం' చేయటం నేర్పాలి. కలిమాలు కంఠస్థం చేయించటంతోపాటు వాటి భావార్థాన్ని విడమరచి చెప్పాలి. (2) బాల్యం నుంచే నమాజు పట్ల శ్రద్ధాసక్తులను కలిగించాలి. ఏడేండ్లు వచ్చాక నమాజు చేయమని ప్రోత్సహించాలి. పదేండ్ల ప్రాయంలో నమాజుకై గట్టిగా ఆదేశించాలి. ఈ వయసులో పిల్లల పడకలను కూడా వేరుచేయాలి. (3) దుర్భాషలకు, దురాచారాలకు, చెడు సావాసాలకు వారిని దూరంగా ఉంచాలి. (4) ముఖ్యంగా ఆడ పిల్లల్లో సిగ్గు, బిడియం, అణకువను చిన్నప్పటి నుండే ఒంట బట్టించాలి. పసితనం నుంచే సంస్కారవంతమైన వస్త్రధారణ గురించి నొక్కి చెప్పాలి. (5) పిల్లలను చాలా జాగ్రత్తగా, సూక్ష్మదృష్టితో గమనిస్తూ ఉండాలి. అంటే - వారి సావాసాలు ఎలాంటివి? ఎక్కువ సమయం వారు ఎవరితో గడుపుతున్నారు? వారి రోజువారి కార్యక్రమాలేమిటి? లాంటి విషయాలను అబ్జర్వ్‌ చేస్తుండాలి.
వేళాకోళానికి కూడా పిల్లల ముందు చెడు అనరాదు. ఆడిన మాట తప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. వెకిలి సైగలు చేయరాదు. ఇతరులను చెడు పేర్లతో పిలవరాదు. పైగా పిల్లల వల్ల జరిగే తప్పులను ఎప్పడికప్పుడు సరిదిద్దుతూ ఉండాలి. వారు చేసే ప్రతి మంచి పనిపై 'శభాష్‌!' అంటూ ఎంకరేజ్‌ చేస్తుండాలి.

కామెంట్‌లు లేవు: